ముందుకు సాగని వైఎస్సార్‌ బీమా సర్వే

ABN , First Publish Date - 2021-05-22T05:06:53+05:30 IST

వైఎస్సార్‌ బీమా అర్హులందరికీ అందాలని.. ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని ప్రభుత్వ ముఖ్యఉద్దేశం.

ముందుకు సాగని వైఎస్సార్‌ బీమా సర్వే

అర్హులందరికీ అందాలన్న ముఖ్యఉద్దేశం 

బ్యాంకుల్లో పూర్తికాని ఆన్‌లైన్‌ ప్రక్రియ 

 ఈ నెల 31 వరకు గడువు 


పొదలకూరు, మే 21 : వైఎస్సార్‌ బీమా అర్హులందరికీ అందాలని.. ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని ప్రభుత్వ ముఖ్యఉద్దేశం. అందులో భాగంగా చేపట్టిన  బీమా సర్వే పనులు మండలంలో ముందుకు సాగడం లేదు. దీనికి ఈనెల 31వ తేదీ వరకు గడువు నిర్ణయించారు. గతేడాది అక్టోబరు, నవంబరులలో పనులు ప్రారంభమైనా అనేక సమస్యలతో ఇప్పటికీ సాగుతూనే ఉండటం గమనార్హం. ఫలితంగా లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది.  


క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి..

బ్యాంకు ఖాతాలకు సంబంధించి అన్ని వివరాలు సవ్యంగా ఉంటేనే తెరచుకుంటాయి. ప్రధానంగా ఆధార్‌, రేషన్‌కార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీల్లో తప్పులున్న వారు చాలామంది ఉన్నారు. మరోవైపు ఖాతాలు తెరిచి వాటిని కొనసాగించని వారు అనేకమంది ఉన్నారు. అయితే ఖాతాలున్నా అందులో బీమాకు సరిపడినంత నగదు నిల్వలు లేకపోవడంతో ఆగిపోతున్నవి కూడా ఉన్నాయి. జిల్లాలో బీమా నమోదుకు సంబంధించి 30 నుంచి 35 బ్యాంకులుంటే అందులో కేవలం 12 నుంచి 14 బ్యాంకుల్లో మాత్రమే సిబ్బంది బీమా నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రైవేటు, కార్పొరేట్‌, ప్రాంతీయ తదితర బ్యాంకులు బీమా వివరాలు నమోదు చేయడం లేదు. మిగిలిన బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారులకు మొండిచెయ్యే మిగిలింది. ఇలాంటి ఖాతాదారులంతా ఇతర బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం మండలంలో కర్ఫ్యూ కారణంగా బ్యాంకు పనివేళల్లో మార్పులు చేశారు. బ్యాంకర్లు వారి పనులకు సంబంధించి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. బీమా నమోదును అసలు పట్టించుకోవడం లేదు. ఇలా అనేక రకాల సమస్యలతో పనులు సాగడం లేదు.  


బీమా ప్రయోజనం...

18ఏళ్ల నుంచి 50ఏళ్ల వయస్సు వారు సహజ మరణం పొందితే రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు అయితే రూ.5లక్షలు పరిహారం ఉంటుంది. అలాగే 51ఏళ్ల నుంచి 70ఏళ్ల మధ్యవారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.3లక్షలు, శాశ్వత అంగవైకల్యమేతే రూ.3లక్షలు, అలాగే 18ఏళ్ల నుంచి 70ఏళ్ల వయస్సు మధ్య  వారికి ప్రమాదవశాత్తుగానీ, పాక్షిక, శాశ్వత అంగవైకల్యమైతే రూ.1.50లక్షలు పరిహారం అందుతాయి.


గడువు పెంచితే ప్రయోజనం...

వైఎస్సార్‌ బీమాలో నమోదైంది సగం మందే మాత్రమే. ఈ క్రమంలో గడువు పెంచితే ప్రయోజనం ఉంటుంది. చాలా వరకు కార్డుల సర్వే పూర్తి అయినా బ్యాంకుల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ  పూర్తికాలేదు. దీంతో కొన్ని కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయి. ఆ కుటుంబాల వివరాలను సేకరించాల్సి ఉంది. బీమాలో నమోదు కావ్వాల్సినవారు ఎక్కువ మంది ఉండటం, గడువు తక్కువ ఉండటంతో మరికొన్ని రోజులు నమోదుకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-22T05:06:53+05:30 IST