ముచ్చటగా మూడోసారి!

ABN , First Publish Date - 2021-11-06T05:10:28+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ బిల్లులన్నీ పక్కన పెట్టేసింది.

ముచ్చటగా మూడోసారి!
ఇంజనీరింగ్‌ శాఖల అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ హరేందిరప్రసాద్‌

‘నీరు-చెట్టు’ పనుల తనిఖీకి మరో బృందం

ఇప్పటికే విజిలెన్స, ఇరిగేషన అధికారుల విచారణ

తాజాగా మరో శాఖ ఇంజనీర్లతో పరిశీలన

అధికారులతో జేసీ హరేందిర ప్రసాద్‌ సమావేశం

ఐదేళ్ల క్రితం పనుల నాణ్యత ఇప్పుడు సాధ్యమేనా!?

అసహనం వ్యక్తం చేస్తున్న ఇంజనీర్లు

బిల్లులు ఆలస్యం చేసేందుకేనంటూ కాంట్రాక్టర్ల ఆగ్రహం 


‘‘ఎప్పుడో ఐదేళ్ల క్రితం చేసిన పనులను ఇప్పుడు పరిశీలించాలట! వాటి నాణ్యతను ఇప్పుడు రికార్డు చేసి నివేదిక పంపాలట! ఏమైనా అర్థముందా..! నీరు - చెట్టు పనులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరిది. బిల్లులు ఎలా చెల్లించకూడదో అనేక రకాలుగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో నిబంధనను తెరపైకి తెచ్చింది. ఇప్పటికి రెండు విచారణలు జరగ్గా ఇప్పుడు మూడో విచారణ చేయాలంటూ ఆదేశాలివ్వడం అధికారులు విస్తుపోతుండగా, కాంట్రాక్టర్లలో ఆగ్రహం తెప్పిస్తోంది. అది కూడా ఇరిగేషన శాఖ ఆధ్వర్యంలో జరిగిన పనులను ఇతర ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు పరిశీలించాలని ఆదేశాలు వెలువడ్డాయి.


నెల్లూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ బిల్లులన్నీ పక్కన పెట్టేసింది. గడిచిన రెండేళ్ల నుంచి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎన్ని విన్నపాలు చేసుకున్నా, నిరసనలు తెలియజేసినా పట్టించుకోలేదు. విజిలెన్స విచారణ పేరుతో కాలయాపన చేసింది. ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నుంచి ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో రెండోసారి నీరు-చెట్టు పనులపై విచారణకు ఆదేశించింది. నీరు-చెట్టు పథకం కింద చేసిన పనులన్నీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు వంద శాతం, క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కనీసం 50 శాతం చెక్‌ మెజర్‌మెంట్‌ చేసేలా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఎప్పుడో ఐదేళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పుడు నాణ్యత పరిశీలించడం కష్టమని ఇంజనీర్లు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు.  వేల వర్కులను తనిఖీ చేసి చెక్‌ మెజర్‌మెంట్‌ చేయడం ఇప్పుడు సాధ్యం కాదని ఇంజనీర్లు తేల్చిచెప్పడంతో మొదట కోర్టుకెళ్లిన కాంట్రాక్టర్ల వర్కులను మాత్రమే పరిశీలించాలని ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి. ఆ ప్రకారమే ఇంజనీర్లు ఇటీవల నివేదికలు అందజేశారు. దాదాపుగా అన్ని వర్కులు నాణ్యతగా జరిగినట్లు నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదికలను కోర్టుకు సమర్పిస్తే ఇబ్బంది కలుగుతుందని భావించిన ప్రభుత్వం మరో విచారణను తెరమీదకు తీసుకొచ్చిందని కాంట్రాక్టర్లు విమర్శిస్తుండటం గమనార్హం. 


ఎలా సాధ్యమవుతుంది?


ప్రభుత్వం తాజాగా ఇరిగేషన శాఖ ఇంజనీర్లతో కాకుండా ఇతర ఇంజనీరింగ్‌ శాఖలతో నీరు-చెట్టు పనులను తనిఖీ చేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చింది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, పబ్లిక్‌ హెల్త్‌, గ్రామీణ నీటి సరఫరా, సోమశిల సర్కిల్‌, తెలుగు గంగ ప్రాజెక్టు సర్కిల్‌ ఇంజనీర్లకు నాణ్యత పరిశీలన బాధ్యతలు అప్పగించారు. ఇరిగేషన ఎస్‌ఈ నేతృత్వంలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. 2016-19 సంవత్సరాల మధ్య టీడీపీ ప్రభుత్వంలో నీరు - చెట్టు కింద 13,780 పనులు మంజూరయ్యాయి. అందులో సుమారు పది వేల వరకు పనులు పూర్తయ్యాయి. ఏ ఏడాదికాఏడాది ప్రారంభించని పనులను అధికారులు రద్దు చేస్తూ వచ్చారు. సుమారు రూ.711 కోట్లతో పనులు చేశారు. చివరి రెండేళ్లలో ఎక్కువగా జరిగిన పనులకే బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో సుమారు రూ.200 కోట్లకు పైగానే నీరు - చెట్టు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 89  వర్కులకు సంబంధించి బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎందుకు బిల్లులు చెల్లించలేదో కోర్టుకు సమాధానం చెప్పాలి కాబట్టి రకరకాల విచారణలను తెరమీదకు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


ఇంజనీర్లతో జేసీ సమావేశం


89 వర్కులకు సంబంధించి ఈ నెల 12వ తేదీలోపు నాణ్యత రిపోర్టును తనిఖీ బృందాలు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉండగా మిగిలిన వర్కుల నివేదికలను మూడు నెలల్లో సమర్పించాల్సి ఉంది. కాగా ఈ తనిఖీలపై జాయింట్‌ కలెక్టర్‌ ఎంఎన హరేందిరప్రసాద్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని తిక్కన భవనలో అన్ని ఇంజనీరింగ్‌ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లు ఎప్పుడో చేసిన వర్కులకు ఇప్పుడు నాణ్యత పరిశీలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించడం గమనార్హం. ఇప్పటికే తాము పని ఒత్తిడిలో ఉన్నామని, ఇప్పుడు తమకు సంబంధం లేని పనులను అప్పగించడంపై కూడా ఇంజనీర్లు గళం విప్పుతున్నారు. ఈ తనిఖీల విషయంలో ఇంజనీర్లు ఎలా ముందుకెళారు? ఎటువంటి నివేదికలు అందజేస్తారన్నది ఆసక్తిగా మారింది. 


Updated Date - 2021-11-06T05:10:28+05:30 IST