హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం బతికే ఉంది
ABN , First Publish Date - 2021-05-22T05:05:07+05:30 IST
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని మరోసారి ప్రజలకు నమ్మకం కలిగిందని టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్
వెంకటాచలం, మే 21 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని మరోసారి ప్రజలకు నమ్మకం కలిగిందని టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని టీడీపీ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత రెండేళ్లుగా వైసీపీ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని, దీంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రజాస్వామ్యం ప్రజల పక్షాన నిలిచిందన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రజలు, టీడీపీ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యం ప్రజల పక్షాన నిలిచింది
వెంకటాచలం : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రజాస్వామ్యం ప్రజల పక్షాన నిలిచిందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్‌బాబు శుక్రవారం ఓ ప్రటకనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు, ఇతర ప్రలోభాలకు దిగిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ఎన్నికలు జరగలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగడం లేదని, కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రౌడీ పాలనే సాగుతుందని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన ఈ అత్యున్నతమైన తీర్పు పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.
పొదలకూరు : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం ప్రజాస్వామ్య విజయమని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న హైకోర్టు పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ అన్న నిబంధన పాటించలేదని ఆక్షేపించడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగడం లేదని తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందేనని వెల్లడించారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్యం తీర్పుగా పేర్కొంటూ హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఇందుకూరుపేట : స్థానిక ఎన్నికలను హైకోర్టు రద్దు చేయటం ప్రజాస్వామ్యానికి మరోసారి పట్టాభిషేకం జరిగినట్టేనని టీడీపీ జిల్లా బీసీ సంఘ నాయకుడు పీ.చెంచుకిషోర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు నియంతృత్వానికి, అరాచక పాలనకు గొడ్డలిపెట్టు అన్నారు. ఇప్పటికైనా నాయకులు గుర్తించి అప్పీలు లాంటి దుశ్చర్యలకు పోకుండా తక్షణం కోర్టు ఆదేశాల మేరకు న్యాయ సమ్మత విలువలతో ఎన్నికలు నిర్వహించాలన్నారు.