వైద్యాధికారిపై ఎమ్మెల్యే కిలివేటి ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-30T04:29:58+05:30 IST

ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు వ్యాక్సిన్‌ వేసుకున్నప్పుడు లేని భయం మిగిలినవారు వేసుకునేందుకు ఎందుకు ఉంటుందనీ, వారిని ఒప్పించకుండా ఏవేవో కుంటిసాకులు చెబుతుండటం చూస్తుంటే మీరు సక్రమంగా పనిచేయలేక, దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపైకి తోసేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్యాధికారిపై ఎమ్మెల్యే కిలివేటి ఆగ్రహం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

సూళ్లూరుపేట, అక్టోబరు 29 : ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు వ్యాక్సిన్‌ వేసుకున్నప్పుడు లేని  భయం మిగిలినవారు వేసుకునేందుకు ఎందుకు ఉంటుందనీ, వారిని ఒప్పించకుండా ఏవేవో కుంటిసాకులు చెబుతుండటం చూస్తుంటే మీరు సక్రమంగా పనిచేయలేక, దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపైకి తోసేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ మూడో కరోనా వేవ్‌ అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై స్థానిక వైద్యాధికారి వెంకటరమణను వివరాలు అడిగారు. మండలంలో ఇప్పటికే 97 శాతం వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయిందని, మిగిలినవారు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ముందుకురావడం లేదని వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే అటువంటి వారిని ఒప్పించి వ్యాక్సిన్‌ వేసుకునేలా అధికారులు చేయాలని చెబుతున్న సమయంలో వైద్యాధికారి రకరకాల కారణాలు చెబుతుండటంతో ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్‌ వేసుకోనివారికి వ్యాక్సిన్‌ వేసేలా వెంటనే అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి టాస్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి ఆ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అలాగే మండలంలో జరుగుతున్న వివిధశాఖల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా 65 పనులకుగాను 8.48 కోట్లు మంజూరయ్యాయని, ఆ పనులు ప్రాథమిక దశలో ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ నందకుమార్‌ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశం ఎంపీపీ అల్లూరు అనిల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా మృతి చెందిన ఎంపీటీసీ చిలకా పద్మనాభంకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. సమావేశంలో వారితోపాటు ఎంపీడీవో నర్మద, వివిధ శాఖల అధికారులు, కోఆప్షన్‌ సభ్యుడు జనార్థన్‌రెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:29:58+05:30 IST