గ్రావెల్ ఏమైంది?
ABN , First Publish Date - 2021-08-26T05:14:46+05:30 IST
ఎక్కడైనా రోడ్డు విస్తరణ జరుగుతున్నప్పుడు తవ్విన గ్రావెల్‌ను ఆ రోడ్డు సైడ్ బర్మ్‌లకు ఉపయోగిస్తారు. అలా అవకాశం లేనిపక్షంలో గ్రావెల్‌ను సంబంధిత అధికారులు వేలం వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు విస్తరణ పనుల్లో తవ్విన గ్రావెల్ మాయం అయింది. వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఏమైందో అర్థం కావడం లేదు. దీనిని రోడ్డు బర్మ్‌లకు ఉపయోగించారా... అంటే అసలు పొదలకూరు రోడ్డుకు బర్మ్‌లే కనిపించడం లేదు. అలాగని వేలమూ వేయలేదు. దాదాపు రూ.50 లక్షల విలువైన గ్రావెల్‌ను గుట్టుగా బయటకు తరలించేశారు. దానిని నగర పరిధిలోని కొన్ని ప్రైవేటు లేఅవుట్లలో ఉపయోగించినట్లు సమాచారం.

అరకోటి విలువైన గ్రావెల్ అగుపించదే?
బర్మ్‌లు లేవు.. వేలమూ వేయలేదు
పొదలకూరు రోడ్డు విస్తరణలో మాయ
సైడు కాలువల్లేకుండానే రహదారి నిర్మాణం
వర్షపు నీరు పోయేదెలా..?
ఎక్కడైనా రోడ్డు విస్తరణ జరుగుతున్నప్పుడు తవ్విన గ్రావెల్‌ను ఆ రోడ్డు సైడ్ బర్మ్‌లకు ఉపయోగిస్తారు. అలా అవకాశం లేనిపక్షంలో గ్రావెల్‌ను సంబంధిత అధికారులు వేలం వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు విస్తరణ పనుల్లో తవ్విన గ్రావెల్ మాయం అయింది. వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఏమైందో అర్థం కావడం లేదు. దీనిని రోడ్డు బర్మ్‌లకు ఉపయోగించారా... అంటే అసలు పొదలకూరు రోడ్డుకు బర్మ్‌లే కనిపించడం లేదు. అలాగని వేలమూ వేయలేదు. దాదాపు రూ.50 లక్షల విలువైన గ్రావెల్‌ను గుట్టుగా బయటకు తరలించేశారు. దానిని నగర పరిధిలోని కొన్ని ప్రైవేటు లేఅవుట్లలో ఉపయోగించినట్లు సమాచారం.
నెల్లూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) :
ప్రస్తుతం జిల్లాలో గ్రావెల్ అత్యంత విలువైన ఖనిజంగా మారింది. ఎక్కడైనా తవ్వకాలకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకోవడంతోపాటు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు విస్తరణలో తవ్విన గ్రావెల్ విషయంలో మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఉచితంగా లబ్ధిపొందారని, అందుకు అధికారులు సహకరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగర పరిధిలోనే పేదల కోసం అనేక లేఅవుట్లను సిద్ధం చేశారు. వాటిని చదును చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. పొదలకూరు రోడ్డు విస్తరణకు తవ్విన గ్రావెల్‌ను ఆయా లేఅవట్లకు తరలించి ఉంటే రూ.లక్షల ప్రజాధనం ఆదా అయి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆస్తి స్ర్కాబ్ అయినా కూడా సంబంధిత అధికారులు వేలం వేయాల్సి ఉంటుంది. కానీ నగర పరిధిలో విలువైన గ్రావెల్ విషయంలో మాత్రం అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సైడు కాలువలు ఎక్కడ..?
పొదలకూరు రోడ్డు వెడల్పు తక్కువ కావడం, ఆ మార్గంలో రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతుండడంతో రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. రెండు వరుసలుగా ఉన్న రహదారిని నాలుగు లేన్లుగా మార్చనున్నారు. డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకస్ రోడ్డు వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర విస్తరణ జరగనుంది. సుమారు రూ.4 కోట్లతో ఈ పనులు చేపట్టారు. రోడ్లపక్కనున్న చెట్లతోపాటు పశ్చిమంవైపు ఆక్రమణలు కూడా తొలగించారు. విస్తరణ పనుల్లో మొదటి భాగమైన వెట్‌మిక్స్ వేయడాన్ని కూడా పూర్తి చేశారు. అయితే నగరంలో ప్రధాన రహదారుల్లో ఒకటైన ఈ రోడ్డును సైడు కాలువలు లేకుండానే విస్తరిస్తున్నారు. బర్మ్‌లు వేసేందుకు కూడా స్థలం లేదు. ఈ నేపథ్యంలో వర్షపునీరు ఎలా వెళ్లాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలోని మెయిన్ రోడ్డు, మినీబైపాస్ రోడ్డులకు ఇరువైపులా సైడు కాలువలు నిర్మించడం గమనార్హం. అయ్యప్పగుడి నుంచి జాతీయ రహదారి వరకు సైడు కాలువలు లేకపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా నీరు రోడ్డుపై పారుతోంది. ఆ సమయంలో వాహనాలు వెళ్లడం ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పటిష్టంగా సైడు కాలువ నిర్మిస్తున్నారు. మరి, పొదలకూరు రోడ్డు విషయంలో ఎందుకు సైడు కాలువలు నిర్మించడం లేదో అధికారులకే తెలియాలి!.
ప్యూర్ గ్రావెల్ కాదు
- భరతరత్న, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ
పొదలకూరు రోడ్డులో తవ్వినది ప్యూర్ గ్రావెల్ కాదు. మిక్స్‌డ్‌గా ఉంది. దానిని సైడు బర్మ్‌లకు వేస్తాం. అక్కడ అవసరం లేకపోతే బయటకు తోలేస్తాం.