మందులు ఇవ్వండి మహప్రభో!

ABN , First Publish Date - 2021-04-24T04:53:39+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనా బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందకపోగా మందులైనా ఇవ్వండి మహాప్రభో అంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

మందులు ఇవ్వండి మహప్రభో!
జీజీహెచ్‌లో మందుల కోసం వేచి ఉన్న బాధితులు

జీజీహెచ్‌లో కరోనా బాధితుల గగ్గోలు


నెల్లూరు (వైద్యం) : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనా బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి.  పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందకపోగా మందులైనా ఇవ్వండి మహాప్రభో అంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మందులు ఎందుకు ఇవ్వడం లేదని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సిబ్బందిని ప్రశ్నిస్తే అసలు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పూర్తిస్థాయిలో సరఫరా కావటం లేదన్న సమాధానం వస్తోంది. మందుల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో బాధితులు ఎదురుచూస్తున్నారంటే ఇక్కడ  అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, సకాలంలో మందులు పంపిణీ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 


కరోనాతో ఆరుగురి మృతి 


జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం 949 పాజిటివ్‌లు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 73,600లకు చేరుకున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకోలేక ఆరుగురు మృత్యువాత పడ్డారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న 580 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.


 ఆత్మకూరులో పడకల కొరత


ఆత్మకూరు : స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పడకల కొరత వెంటాడుతోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఇక్కడ 30 బెడ్లు కేటాయించగా 32 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. టిడ్కో భవనంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించినా అక్కడ సరైన సదుపాయాలు కల్పించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


సకాలంలో వైద్యం అందక


 ఆత్మకూరులోని జేఆర్‌పేటకు చెందిన మహిళకు కరోనా బారిన పడటంతో 108లో ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. ఇక్కడ పడకలు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను వైద్యశాలలో చేర్చుకోవడంలో జాప్యం జరగడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందింది. 


ఇద్దరు వార్డు సభ్యులు..


మనుబోలు : మండలంలోని బద్దెవోలు గ్రామంలో కరోనాతో బాధపడుతూ ఇద్దరు వార్డు సభ్యులు శుక్రవారం మృతి చెందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారిద్దరు టీడీపీ మద్దతుదారులుగా గెలుపొందారు.  వార్డు సభ్యుల మృతితో బద్దెవోలులో విషాదచాయలు అలుముకున్నాయి. 


ఉదయగిరిలో పాక్షిక లాక్‌డౌన్‌


ఉదయగిరి రూరల్‌ : కరోనా విజృంభిస్తున్న కారణంగా ఉదయగిరి పట్టణంలో శనివారం నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఇన్‌చార్జి తహసీల్దారు ఫజిహ తెలిపారు. శుక్రవారం మండల కొవిడ్‌ బృందంతో ఆమె సమీక్షించారు.  సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఎంపీడీవో వీరాస్వామి, ఎస్‌ఐ మరిడినాయుడు, వైద్యాధికారిణి శ్రీకళ, ఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:53:39+05:30 IST