మళ్లీ కరోనా మరణం

ABN , First Publish Date - 2021-12-31T07:00:51+05:30 IST

జిల్లాలో చాలా రోజుల తర్వాత కరోనా మరణం నమోదైంది.

మళ్లీ కరోనా మరణం

 6 కొత్త కేసులు నమోదు

ఒమైక్రాన్‌తో జాగ్రత్త : సీఎస్‌


నెల్లూరు(వైద్యం), డిసెంబరు 30 : జిల్లాలో చాలా రోజుల తర్వాత కరోనా మరణం నమోదైంది. పాజిటివ్‌ కేసులు కొనసాగుతున్నప్పటికీ ఎవరూ వైరస్‌ బారినపడి మృతి చెందిన ఘటనలు కొంత కాలంగా లేకపోవడంతో ప్రజల్లో భయాందోళనలు తగ్గాయి. అయితే గురువారం ఒకరు కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 6 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్న 12 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 17,882 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,47,111కు చేరింది. కాగా, కరోనా ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపఽథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కలెక్టర్లను ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫీవర్‌ సర్వే సక్రమంగా జరిగేలా దృష్టిపెట్టాలని, వ్యాధినిరోధక టీకాల ప్రక్రియను విస్తృతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T07:00:51+05:30 IST