మహిషాసురమర్ధినిగా కామాక్షితాయి

ABN , First Publish Date - 2021-10-15T03:00:05+05:30 IST

మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం కామాక్షితాయి మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసురమర్ధినిగా కామాక్షితాయి
ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన కోదండరాముడు

  బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 14: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం కామాక్షితాయి మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం పుణ్యాహవచనం, కలశపూజ, నవావరణ పూజలు చేశారు. మహర్నవమి సందర్భంగా కామాక్షితాయి మూలవర్లతోపాటు ఎదురుగా మహిషాసురుడ్ని వధించినట్లు కొలువుదీర్చిన అమ్మవారి ఉత్సవమూర్తిని అధిక సంఖ్యలో  భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత కొండూరు సుబ్బరామిరెడ్డి, సౌందర్యమ్మ మనుమడు మహీధర్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. వల్లూరు రవీంద్రారెడ్డి దంపతులు  భక్తులకు భోజన ప్యాకెట్లు, చిట్టమూరు వెంకటరెడ్డి, సుగుణమ్మల సహకారంతో ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, సభ్యులు, ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి  పర్యవేక్షించారు.  అలాగే బుచ్చిలోని కోదండరామస్వామి, కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివార్లు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా దుర్గానగర్‌లోని దుర్గమ్మ, కనిగిరి రిజర్వాయర్‌ వద్ద దుర్గా మల్లేశ్వరాలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  


నేడు విజయదశమి

దసరా వేడుకల్లో నేడు విజయదశమి సందర్భంగా ఆలయంలో రాత్రి శమీపూజ, అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహించి, అనంతరం స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఏకాంతసేవతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.   

ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నం చాముండేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం అభిషేకాలు, కుంకుమ పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. విశేష పూజల అనంతరం మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి పల్లకిసేవ నిర్వహించారు. అలాగే పల్లెపాడు కామాక్షి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఇందుకూరుపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొత్తూరు లలిత మహేశ్వర ఆలయం, ఇందుకూరుపేట ఇందుపూరమ్మ ఆలయాల్లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.  భక్తులు  విశేషంగా హాజరై అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు.  

మనుబోలు : మండల కేంద్రమైన మనుబోలులో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం దుర్గాదేవిని మనుబోలులో కన్యకాపరమేశ్వరిగా అలంకరించారు. పొట్టి నాగేంద్రప్రసాద్‌, అనురాధ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అలాగే కోదండరామపురంలో దుర్గాదేవిగా అలంకరించారు.  మల్లి చెంచుఓబులు, సుభాషిణి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. దేవాంగుల వీధిలో మహిషాసురమర్ధినిగా అలంకరించారు. అనంతరం భక్తులకు ఉభయకర్తలు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.





Updated Date - 2021-10-15T03:00:05+05:30 IST