జిల్లాలో అడుగిడిన మహా పాదయాత్ర
ABN , First Publish Date - 2021-11-21T05:46:02+05:30 IST
ఒక రాష్ట్రానికి ఒక రాజధాని నినాదంతో న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రం శుక్రవారం సాయంత్రం జిల్లాలో అడుగుపెట్టింది.

ఘనస్వాగతం పలికిన రాజకీయ నాయకులు, రైతులు
‘‘జై అమరావతి’’ అంటూ విద్యార్థినుల నినాదం
నేటి ఉదయం నుంచి యాత్ర
కావలి రూరల్, నవంబరు 20 : ఒక రాష్ట్రానికి ఒక రాజధాని నినాదంతో న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రం శుక్రవారం సాయంత్రం జిల్లాలో అడుగుపెట్టింది. కావలి మండలం రాజువారి చింతలపాలెం వద్ద కావలి, ఉదయగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీతో పాటు వివిధ పార్టీల నాయకులు, రైతులు డప్పులు కొడుతూ ఘనస్వాగతం పలికారు. ఆర్సీపాళెం ప్రారంభం నుంచి బస చేసే బ్రహ్మయ్య స్వామి ఆశ్రమం వరకు వారితో కలిసి నడిచి సంఘీభావం తెలిపారు. కావలి మండలం చలంచర్ల పెద్దారానికి చెందిన కొత్తపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు జై అమరావతి అంటూ చేసిన నినాదాలు ఆకట్టుకున్నాయి. అమరావతి రైతుల జేఏసీ నాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ మహా పాదయాత్రకు గ్రామాలు, పట్టణాల నుంచి వస్తున్న జనసమూహాన్ని చూసైనా ఈ ధ్రుతరాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. రోడ్డు మీద గుంతలు కూడా పూడ్చలేని ఈ పాలకులా 3 రాజధానులు కట్టేది అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, టీడీపీ నాయకులు దివి శివరాం, మాలేపాటి సుబ్బానాయుడు, కన్నబాబు, చెంచలబాబు యాదవ్, గుత్తికొండ కిషోర్, మన్నవ రవిచంద్ర, మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాజకుమార్ చౌదరి, కాంగ్రెస్ నేత చింతాల వెంకట్రావు, సీపీఐ నాయకులు దామా అంకయ్య, డేగా సత్యనార్యాణ, బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకులు మాల్యాద్రి, పెంచలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం సీతా రామయ్య, జనసేన నాయకులు రిషికేష్, కిషోర్ తదితరులు పాదయాత్ర రైతులకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.
నేటి నుంచి జిల్లాలో..
కావలి : కావలి నియోజకవర్గంలో ఆదివారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు 45.2 కి.మీ పొడవున మహా పాదయాత్ర కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు పాదయాత్రగా రైతులు బయలుదేరి కొత్తపల్లి మీదుగా సిరిపురం రోడ్డు జంక్షన చేరుకుని అక్కడ భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కావలిలోని వైకుంఠపురం సెంటర్, ట్రంకురోడ్డులో ఉన్న ఏబీఎం సెంటర్‌కు చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి ముసునూరు, గౌరవరం చేరుకుని మధ్యాహ్నం గౌరవరం వద్ద భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రికి బోగోలు మండలం కొండబిట్రగుంటకు చేరుకుని అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కొండబిట్రగుంట నుంచి బయలుదేరి మధ్యాహ్నం అల్లూరు రోడ్డు ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 3 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి దగదర్తి మండలం సున్నపుబట్టీ సెంటర్‌లోని అట్టల ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.