రామదండులా కదిలిన మహా పాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-24T04:47:31+05:30 IST

పాదయాత్ర ప్రారంభానికి ముందు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

రామదండులా కదిలిన   మహా పాదయాత్ర
బిట్రగుంట జంక్షన్‌కు చేరిన పాదయాత్ర

కొండబిట్రగుంట నుంచి సున్నపుబట్టీ వరకు హోరెత్తిన అమరావతి నినాదాలు

ప్రజాసంఘాలు, రైతుల నుంచి అపూర్వ మద్దతు

అడుగడుగునా ఘనస్వాగతం, ప్రజల నీరాజనం


న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు 23వరోజు మంగళవారం అపూర్వస్వాగతం లభించింది. బిట్రగుంట, దగదర్తి మండలాల్లో యాత్ర సాగగా, ప్రజలు, రైతులు మంగళహారతులు, పూలవర్షంతో స్వాగతం పలికారు. బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆశీర్వాదంతో కొనసాగిన యాత్రలో ప్రజలు, రైతులు, ప్రజాసంఘాల నాయకులు తమ సంఘీభావం తెలిపి, రామదండులా అడుగు కలిపారు.  ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో  ముంగమూరు, కడనూతల, కోవూరుపల్లి, కప్పరాళ్లతిప్ప, ఉలవపాళ్ల, అల్లూరురోడ్డు, దామవరం క్రాస్‌రోడ్డు మీదుగా 15 కిలోమీటర్లు యాత్ర సాగించిన రైతులు దగదర్తి మండలం సున్నపుబట్టి వరకు చేరుకుని, అక్కడ రాత్రి బసచేశారు.  


దగదర్తి/బిట్రగుంట, నవంబరు 22: పాదయాత్ర ప్రారంభానికి ముందు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం పొందారు. గిరిప్రదక్షిణ చేశారు. అనంతరం  ముంగమూరు జాతీయ రహదారి నుంచి కడనూతలకు చేరుకున్న పాదయాత్రకు స్థానిక రైతులు పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికారు.  టీడీపీ జాతీయ ప్రఽధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కండ్లగుంట మధుబాబు నాయుడు వారికి మద్దతుగా యాత్రలో పాల్గొన్నారు. అక్కడున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ముందుకు సాగారు. అక్కడి నుంచి కోవూరుపల్లి చేరుకున్న వారికి స్థానిక మహిళలతో కలిసి బీద రవిచంద్ర సతీమణి జ్యోతి మంగళ హారతులు ఇచ్చా రు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతు లు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. తిప్ప కూడలిలో స్థానిక రైతులు పూలవర్షం కురిపించారు. అక్కడ నుంచి బయలుదేరిన పాదయాత్ర ఉలవపాళ్ల దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 


దగదర్తిలో ఘనస్వాగతం


 బోగోలు మండలం నుంచి పాదయాత్ర మధ్యాహ్నం  దగదర్తి మండలానికి చేరుకుంది. మధ్యాహ్నాం 12.30గం టలకు మండలంలోని దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయంలో రైతులు భోజన విరామం తీసుకు న్నారు. ఈ సందర్భంగా వారికి దగదర్తి టీడీపీ మండల అధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో నాయకులు టెంకాయలు కొట్టి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల నుంచి 20 కార్లలో 100 మంది రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. వారిని పరామర్శించి, విరాళాన్ని అందజేశారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నాం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. అల్లూరు రోడ్డు వద్దకు చేరుకోగానే, చుట్టుపక్కల గ్రామాల రైతులు, మహిళలు మాజీ జడ్పీటీసీ సభ్యులు బీద గిరిధర్‌ ఆధ్వర్యంలో మంగళహారతులు ఇచ్చారు. దామవరం చేరుకోగానే దగదర్తి నవయువ యూత్‌ నాయకులు మాలేపాటి ప్రకాశ్‌, ముత్తం విష్ణు, తుమ్మల దినేష్‌, కోయి నరేష్‌ ఘనస్వాగతం పలికారు. రైతులపై పూలవర్షం కురిపించి వారితో కలిసి సున్నపుబట్టి వద్దకు చేరుకున్నా రు. సున్నపుబట్టి వద్ద దగదర్తి నుంచి వచ్చిన రైతులు టెంకాయలు కొట్టి, హారతులిచ్చారు. అక్కడే జాతీయ రహదారిపై ఉన్న మణికంఠ డాబా ప్రాంగణంలో మాలేపాటి సుబ్బానాయుడు అమరావతి రైతులకు రాత్రి బస ఏర్పాటు చేశారు. పాదయాత్రకు జిల్లా వడ్డెర సంఘం నాయకులు మద్దతు తెలిపారు. పలుగు, పార చేతపట్టి సంఘం నాయకులు మల్లి నిర్మల, బెల్లంకొండ శ్రీనివాసులు పాదయాత్రలో పాల్గొన్నారు.


నేడు యాత్ర సాగెదిలా..


మహాపాదయాత్ర బుధవారం ఉదయం సున్నపుబట్టి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి కొడవలూరు మండలం కమ్మపాళేనికి చేరుకుంటారు. అక్కడే భోజనం అనంతరం 3 గంటలకు బయలుదేరి రాత్రికి నార్తురాజుపాళేనికి చేరుకుని అక్కడ బస చేస్తారు. మొత్తం 14 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది. Updated Date - 2021-11-24T04:47:31+05:30 IST