మనోళ్లే.. అడిగినంత ఇచ్చేయండి !

ABN , First Publish Date - 2021-11-09T05:03:35+05:30 IST

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయి ప్రచారంపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఈ క్రమంలో వారికి మద్యం పంపిణీ పెద్ద కష్టంగా మారింది.

మనోళ్లే..   అడిగినంత ఇచ్చేయండి !

ఎన్నికలకు కేసుల కొద్దీ మద్యం తరలింపు

అంతా ప్రభుత్వ దుకాణాల నుంచే సరఫరా

ఉద్యోగులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు


నెల్లూరు(క్రైం) నవంబరు 8 : నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయి ప్రచారంపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఈ క్రమంలో వారికి మద్యం పంపిణీ పెద్ద కష్టంగా మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మూడు మద్యం సీసాల కంటే ఎక్కువ ఇవ్వకపోవడం, బార్లలో రేట్లు 30 శాతం ఎక్కువగా ఉండటంతో మద్యం దుకాణాల నుంచి కేసుల కొద్దీ మద్యం తెప్పించే పనిలో  అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి రూ.150, రూ.180 మద్యం కేసులు ఇవ్వాలంటూ విధులు నిర్వహించే ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీనికితోడు అధికారులు సైతం అధికారపార్టీ నేతలు చెబితే చూసీ చూడనట్లు వ్యవహరించండి... అని సిబ్బందికి సూచిస్తున్నారు. దీంతో కేసుల కొద్దీ మద్యం ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బయటకు వెళ్లిపోతోంది. 


ప్రచారాలకంతా చీపే!

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చీప్‌ లిక్కర్‌ దొరకాలంటే అదృష్టం ఉండాలని మందుబాబులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు దుకాణాలు తెరిచే సమయానికి వెళ్లినా రూ.150, 180 రేటు ఉండే మద్యం దొరకడం లేదని వాపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ చీప్‌ మద్యాన్నే పంచుతున్నారని, అందుకే తమకు షాపుల్లో దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీ మినహా మిగిలిన పార్టీల అభ్యర్థులకు మద్యం ఇవ్వొద్దని, అలా ఇస్తే ఉద్యోగాలు చేయలేరని అధికార పక్షం వారు దుకాణాల సిబ్బందిని బెదిరిస్తున్నట్లు సమాచారం. అయితే కొందరికే ఎక్కువ మొత్తంలో మద్యం ఇచ్చేస్తే మిగిలిన వారు నిలదీస్తారని, అప్పుడు తాము ఏం చెప్పాలని వారు వాపోతున్నారు.


కేసుల కొద్దీ తరలింపు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి నాయకులు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చి మద్యం తెప్పించుకుంటున్నారు. ఓ వ్యక్తి మద్యం దుకాణం వద్దకు వెళ్లి, ఫలానా నాయకుడు పంపాడు ఇన్ని కేసుల మద్యం కావాలి అంటాడు. వెంటనే ఆ నాయకుడికి ఫోన్‌ చేసి ఉద్యోగుల చేతికి ఇస్తాడు. ‘ఆ మావాడే.. ఇచ్చి పంపండి’ అని సూచించడంతో మద్యం కేసులను బయటకు పంపుతున్నారు. లుంగీల్లో, గోతాల్లో, కవర్లలో పదుల సంఖ్యలో సీసాలను తీసుకెళుతున్నారు. రాత్రిపూట అయితే కేసుల కొద్దీ లిక్కర్‌ దుకాణాలు దాటుతోంది. ఇదే చాన్స్‌ అన్నట్లుగా పలువురు ఉద్యోగులు మద్యం సీసాలపై ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా  నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. 

Updated Date - 2021-11-09T05:03:35+05:30 IST