ప్రజాధనం చదును చేసేశారు!

ABN , First Publish Date - 2021-01-14T04:03:33+05:30 IST

ఓ వైపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు.. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల ఒత్తిళ్లు.. ఫలితంగా మండల స్థాయిలో అధికారుల హడావుడితనం.. వెరసి రూ.కోట్ల ప్రజాధనం వృథా.

ప్రజాధనం చదును చేసేశారు!
మనుబోలులో లేఅవుట్‌ వేశాక వివాదాల్లోకి వెళ్లిన భూమి

లేఅవుట్ల రూపంలో రూ.కోట్లు వృథా

మొదట వివాదాస్పద భూమి ఎంపిక

రూ.లక్షలతో చదును, హద్దురాళ్ల ఏర్పాటు

కోర్టు సమస్యలతో మరోచోట లే అవుట్‌

అయినా పేదలకు అందని ఇళ్ల స్థలాలు 


మండల కేంద్రం మనుబోలులో నాలుగు లేఅవుట్లు వేశారు. వీటిలో రెండు చోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేయగా, మిగిలిన రెండూ వివాదాల్లో ఉన్నాయి. మొదట కలువాయి రోడ్డులోని సర్వే నెం.23-2లో 3.69 ఎకరాల్లో లేఅవుట్‌  వేశారు. ఇక్కడ 80 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. దీనిని చదును చేసేందుకు ఉపాధి హామీ కింద సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేశారు. గ్రావెల్‌తో చదును చేసి హద్దు రాళ్లు పాతాక కొందరు కోర్టుకెళ్లడంతో బ్రేక్‌ పడింది. అయితే ఈ వివాదం ఇప్పుడు తేలదని భావించిన అధికారులు సర్వే నెం.233లో 214 మందికి పట్టాలు ఇచ్చేలా మరో లేఅవుట్‌ వేశారు. ఇందుకు రూ.40 ఖర్చు చేశారు. కానీ అంతా అయ్యాక ఇది కూడా వివాదంగా మారి కోర్టుకెక్కింది. ఈ రెండు చోట్లా సుమారు రూ.80 లక్షల ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేని పరిస్థితి. 


వెంకటగిరి మండలం సోమసానిగుంట గ్రామంలో 1.30 ఎకరాలో లేఅవుట్‌ వేశారు. 54 మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ కొంతమంది గిరిజనులు చాలాకాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ రూ.15 లక్షలు ఖర్చు చేసి లేఅవుట్‌ వేశారు. అయితే తర్వాత గిరిజనులు కోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. దీంతో ఈ లేఅవుట్‌కు బ్రేక్‌ పడింది. ఇప్పుడు మరో స్థలం కోసం అధికారులు వెతుకుతున్నారు. ఇక్కడా ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్కరికి కూడా ఉపయోగం లేకుండా పోయింది. 


నెల్లూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : ఓ వైపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు.. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల ఒత్తిళ్లు.. ఫలితంగా మండల స్థాయిలో అధికారుల హడావుడితనం.. వెరసి రూ.కోట్ల ప్రజాధనం వృథా. ఇదీ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వేసిన లేఅవుట్లలో జరిగిన తీరు. హడావుడిగా ఒకచోట లేఅవుట్‌ వేస్తారు. ఉపాధి హామీ కింద రూ.లక్షలు ఖర్చు చేసి ఆ స్థలాన్ని చదును చేయడంతోపాటు హద్దు రాళ్లు నాటుతారు. ఆ తర్వాత ఆ భూమిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో తదుపరి పనులకు బ్రేక్‌ పడుతుంది. అయితే త్వరగా ఈ వివాదాలు కోర్టులో తేలేటివి కాకపోవడంతో మరోచోట లేఅవుట్‌ వేస్తారు. అక్కడా రూ.లక్షలు ఖర్చు చేసి చదును, హద్దు రాళ్లు నాటుతారు. ఈవిధంగా జిల్లాలో పదుల సంఖ్యలో లేఅవుట్లు వివాదాల్లోకి వెళ్లాయి. వీటిలో రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్కపేద వాడికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. మరి ఈ ప్రజాధనం వృథాకు బాధ్యత ఎవరు వహించాలి? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ మొదటి నుంచీ హడావుడిగా జరిగింది. జిల్లాలో 3743 ఎకరాల్లో 1477  లేఅవుట్లు వేశారు. 1,73,816 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే, భూముల ఎంపిక దగ్గర నుంచి కొనుగోలు ధరల వరకు అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములను తీసుకొని లేఅవుట్లు వేయడంతో కొన్నిచోట్ల వివాదాలు తలెత్తాయి. కొందరు కోర్టులను ఆశ్రయించడంతో వాటికి బ్రేక్‌ పడింది. ఇక చాలా చోట్ల మార్కెట్‌కు మించి ధరలు చెల్లించారన్న విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తీవ్రంగా ఉండడంతో వారు కూడా చాలా వరకు నిబంధనలు పక్కనపెట్టారన్న ప్రచారం ఉంది. కొన్ని గ్రామాల్లో లేఅవుట్లు వేయకముందే అధికారులు ఎంపిక చేసిన భూములు కోర్టు మెట్లెక్కాయి. ఇలా ఓ వైపు ఒత్తిళ్లు, మరోవైపు హడావిడిగా లేఅవుట్లు సిద్ధం చేయడంతో చాలా గ్రామాల్లో పేదలు ఇళ్ల స్థలాలు అందుకోలేకపోయారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మొదట మూడెకరాల భూమిలో లేఅవుట్‌ సిద్ధం చేశారు. ఇందుకు సుమారు రూ.31 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే లేఅవుట్‌ సిద్ధమయ్యాక ఆ భూమి పాఠశాలకు కేటాయించిన భూమిగా రికార్డుల్లో ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో లేఅవుట్‌ సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని అధికారులు ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారన్నదే ఇక్కడ ప్రశ్న. కాగా తర్వాత అదే గ్రామంలో మరో చోట అధికార పార్టీ నేత నుంచి భూమి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొని లేఅవుట్‌ సిద్దం చేశారు. ఇందుకు సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు. తీరా చూస్తే అది సీలింగ్‌ భూమిగా తేలడంతో ఆ గ్రామంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భూసేకరణ చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ముందుగానే అన్నీ చూసుకుంటారు. కానీ పేదల ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం ఆ పద్ధతిని పక్కనపెట్టడంతోనే ఇప్పుడు సమస్యలు ఏర్పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


Updated Date - 2021-01-14T04:03:33+05:30 IST