అది వక్ఫ్‌బోర్డు స్థలం

ABN , First Publish Date - 2021-07-13T04:55:48+05:30 IST

నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో వక్ఫ్‌బోర్డుకు చెందిన స్థలాలను అక్రమిస్తున్నారంటూ వివిధ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు.

అది వక్ఫ్‌బోర్డు స్థలం
వివాదాస్పద స్థలంలో బైఠాయించిన ముస్లిం నాయకులు

పలు పార్టీల మైనార్టీ నేతల ఆందోళన

అది కార్పొరేషన్‌ రిజర్వ్‌ స్థలం : అధికారులు

మాగుంట లేఅవుట్‌లో భూ వివాదం


నెల్లూరు(సాంస్కృతికం), జూలై 12 : నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో వక్ఫ్‌బోర్డుకు చెందిన స్థలాలను అక్రమిస్తున్నారంటూ వివిధ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ  మైనార్టీ విభాగం అధ్యక్షుడు సాబీర్‌ఖాన్‌, టీడీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి జాఫర్‌ షరీఫ్‌, జియా ఉల్‌హక్‌, కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌, ముస్లిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి సులేమాన్‌, ఆవాజ్‌ నుంచి రషీద్‌, ఇన్సాఫ్‌ నుంచి అజీజ్‌, వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీ నుంచి జిలానీ, ఇతర నాయకులు ఆ స్థలంలో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శేషగిరిరావు, డీఈ రఘురామ్‌ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. సదరు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించడానికి జిల్లా కలెక్టర్‌ ఆమోద ముద్ర వేశారని తెలిపారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇంజనీర్‌ శేషగిరిరావు వ్యాఖ్యానించారు. అది వక్ఫ్‌బోర్డు స్థలమని ఆధారాలుంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని, లేదంటే న్యాయస్థానాలకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కొంతమంది పెద్దల కనుసన్నల్లో వక్ఫ్‌బోర్డు ఆస్తులను స్వాహా చేస్తున్నారన్నారు. 1963వ సంవత్సరం ప్రభుత్వ గెజిట్‌లో 601, 602 సర్వే నెంబర్లలో 8 ఎకరాల 77 సెంట్ల వక్ఫ్‌బోర్డు స్థలం ఉన్నట్టు ఆధారాలు చూపించారు. అలాగే వక్ఫ్‌బోర్డు సీఈవో కూడా ఇది వక్ఫ్‌బోర్డుకు సంబంధించినదేనని ఉత్తర్వులు ఇచ్చారని, వాటిని పరిగణలోకి తీసుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మైనార్టీ నేతలు మండిపడ్డారు. మరోవైపు కార్పొరేషన్‌ అధికారులు మాత్రం ఇది నగర పాలక సంస్థకు సంబంధించిన రిజర్వ్‌ స్థలమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ పోరాటానికి సిద్ధమని మైనార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత వివాదానికి కారణమైన స్థలం సైన్సు పార్కు కోసం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-07-13T04:55:48+05:30 IST