భూ వివాదంలో రగడ

ABN , First Publish Date - 2021-10-29T05:16:42+05:30 IST

ఓ భూ వివాదంలో కొందరిని నెల్లూరు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అది కాస్త పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది.

భూ వివాదంలో రగడ
పోలిసు స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న కనుపర్తిపాడు వాసులు

నెల్లూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

కనుపర్తిపాడులో వివాదమై రేగిన గొడవ 

కేసు నమోదు చేసిన పోలీసులు 


నెల్లూరు రూరల్‌, అక్టోబరు 28 : ఓ భూ వివాదంలో కొందరిని నెల్లూరు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అది కాస్త పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. రంగంలోకి దిగిన రూరల్‌ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి ఆందోళనకారులను శాంతింపచేశారు. పోలీసులు అందించిన వివరాల మేరకు... నెల్లూరుకు చెందిన బిరదవోలు దివ్యారెడ్డికి రూరల్‌ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద సర్వే నెం. 25-1-2బీలో ఐదెకరాలు పొలం ఉంది. ఆమె మాజీ మిలటరీ అధికారి పాలిచర్ల భాస్కర్‌రెడ్డి నుంచి 2004లో ఆ భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆ పొలంలోకి స్థానికులైన గుంట వెంకట్రావుతోపాటు మరికొందరు అక్రమంగా ప్రవేశించి, చెట్లు కొట్టి చదును చేయసాగారు. ఇదేమని ప్రశ్నించగా తమపై దౌర్జన్యం చేసినట్లు దివ్యారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకట్రావుతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే తమ వారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని పోలీసులు దాడి చేశారంటూ కొందరు స్టేషన్‌లోనే నినాదాలు చేయడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉండగా అదే భూమికి మరొకరి వద్ద రికార్డులు ఉన్నట్లు చెబుతున్నందున పూర్వాపరాలను విచారిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. లింకు డాక్యుమెంట్ల ఆధారంగా భూమి ఎవరిదన్నది తేలుతుందని చెప్పారు. తాము ఎవరిపైనా దాడి చేయలేదని, ఈ విషయంపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Updated Date - 2021-10-29T05:16:42+05:30 IST