సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌

ABN , First Publish Date - 2021-12-26T04:39:11+05:30 IST

ఐదుగురు యువకులు పట్టపగలు ఓ ఇంట్లోకి దౌర్జన్యంగా దూరి ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్‌ చేసి కారులో పరారయ్యారు. కోటలో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలరేపింది.

సినీ  ఫక్కీలో యువతి కిడ్నాప్‌

కోటలో కలకలం

 ముమ్మర గాలింపు 

 పోలీసుల అదుపులో నలుగురు యువకులు 

కోట, డిసెంబరు 25 : ఐదుగురు యువకులు పట్టపగలు ఓ ఇంట్లోకి దౌర్జన్యంగా దూరి ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్‌ చేసి కారులో పరారయ్యారు. కోటలో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలరేపింది. పోలీసుల కథనం మేరకు కోటకు చెందిన ఓ యువతి తిరుపతిలోని ఓ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబరులో ఇంటికి వచ్చింది. అదే కళాశాలలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నిఖిల్‌రెడ్డి ఆమెతోపాటు డిగ్రీ ఆఖరి సంవత్సరం చదివాడు. ఈ క్రమంలో నిఖిల్‌రెడ్డి ప్రొద్దుటూరుకు చెందిన తన స్నేహితులు ప్రవీణ్‌, సత్యనారాయణరెడ్డి, అనిల్‌, కొండారెడ్డిలతో కలిసి కారులో కోటకు వచ్చాడు. వారు ఆ యువతి ఇంటిలోకి ప్రవేశించి వరండాలో ఉన్న ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఆమె తల్లిదండ్రులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిచగా  సిని ఫక్కీలో వారిని బెదిరిస్తూ దాడికి యత్నించారు. భయాందోళనతో ఆ తల్లిదండ్రులు కింద పడిపోయారు. అనంతరం ఆ యువకులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని గూడూరు వైపు వేగంగా వెళ్లారు. తల్లిదండ్రులు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో వాకాడు సీఐ హరిబాబు, కోట ఎస్‌ఐ పుల్లారావు అప్రమత్తమై సరిహద్దు పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సుమారు 2 గంటల పాటు కారును వెంబడించి చివరికి గూడూరు హైవేలో పట్టుకున్నారు. అప్పటికే నిఖిల్‌రెడ్డి ఆ యువతిని బలవంతంగా తీసుకొని పరారయ్యాడు. కారులో ఉన్న అతడి నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకొని కోట పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా అటు పోలీసులు, ఇటు స్థానికులు ఉలిక్కిపడ్డారు.

Updated Date - 2021-12-26T04:39:11+05:30 IST