అవినీతిపై ప్రమాణానికి సిద్ధం

ABN , First Publish Date - 2021-05-19T04:12:33+05:30 IST

నీటిపారుదల శాఖ, పబ్లిక్‌హెల్త్‌, కార్పొరేషన్‌ విభాగాల్లో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అవినీతిపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

అవినీతిపై ప్రమాణానికి సిద్ధం
మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

మంత్రి అనిల్‌ సమయం చెప్పాలి

టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి సవాల్‌

నెల్లూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) : నీటిపారుదల శాఖ, పబ్లిక్‌హెల్త్‌, కార్పొరేషన్‌ విభాగాల్లో  మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అవినీతిపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంత్రి తన ఫ్రొటో కాల్‌ను చూసుకుని ప్రమాణం చేసే సమయం చెప్పాలని ఆయన సవాల్‌ విసిరారు. మంగళవారం నెల్లూరులోని తన నివాసం నుంచి కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. చీకట్లో బెట్టింగ్‌లు చేసుకుని బతికే వ్యక్తులు తనను బెదిరించలేరని, తాను సముద్రంలో అలల లాంటి వాడినన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో ఫ్యాంటు జిప్పు విప్పిన సంస్కారహీనుడు మంత్రి అనిల్‌ అని విమర్శించారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిన తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయారని, పక్కనపెట్టుకున్న జగన్మోహన్‌రెడ్డి జైలు కెళ్లారని, సంతోషంగా తిరుగుతున్న ఆనం వివేకానందరెడ్డి చనిపోయారని, మంత్రి అయ్యాక పాపికొండల్లో బోటు తిరగబడి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారని, నెల్లూరులో లక్షల మంది బయటకొచ్చేందుకే బయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సోనూసూద్‌కు ఉన్న తెగువ, మంచితనం మంత్రులకు లేకుండా పోయిందని విమర్శించారు. ఆస్తులమ్మి రాజకీయాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే నేతలు ఆక్సిజన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయలేరా.. అని ప్రశ్నించారు. జీజీహెచ్‌లో రోగులను కింద నుంచి పైఫ్లోర్‌కు తీసుకెళ్లేందుకు కనీసం లిఫ్ట్‌లు కూడా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వాసుపత్రిలో 50 పడకలు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని, అయితే మూడో వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో 300 పడకలను ఏర్పాటు చేయాలని కోటంరెడ్డి కోరారు. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విఫలమయ్యారని, కనీసం కలెక్టర్‌ అయినా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Updated Date - 2021-05-19T04:12:33+05:30 IST