పకడ్బందీగా కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-05-06T05:14:54+05:30 IST
జిల్లాలో బుధవారం కర్ఫ్యూ మొదలైంది. రెండు వారాలపాటు ఈ కర్ఫ్యూ కొనసాగనుండగా, ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు.

జిల్లాలో మొదలైన పాక్షిక లాక్డౌన్
మధ్యాహ్నం 12 తర్వాత దుకాణాల మూత
సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలు
ఎక్కడికక్కడ పోలీసుల చెకింగ్ పాయింట్లు
కర్ఫ్యూను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నెల్లూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బుధవారం కర్ఫ్యూ మొదలైంది. రెండు వారాలపాటు ఈ కర్ఫ్యూ కొనసాగనుండగా, ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత చాలా వరకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయగా మరికొన్నింటిని పోలీసులు మూయించారు. ఆ సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం కొంతమంది యువత అనవసరంగా రోడ్లపైకి రాగా వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తొలిరోజు కావడంతో వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. మధ్యాహ్నం 12 తర్వాత కేవలం మందుల షాపులు, ఇతర అత్యవసర దుకాణాలు మాత్రమే తెరచి ఉంచారు. పోలీసులు చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో బయట తిరుగుతున్న వారిని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారన్నది తెలుసుకున్నాకే అనుమతిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యవసరమైన వాహనాలను మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. కాగా కర్ఫ్యూ అమలు తీరును కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లు స్వయంగా రోడ్లపైకి వచ్చి పరిశీలించారు. నెల్లూరు నగరంలో కేవీఆర్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ కూడలి ప్రాంతాల్లో పర్యటించి రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల సామర్థ్యం పెంచామని, జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరూ ఆక్సిజన్ కొరతతో మరణించలేదని, వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వారియర్స్ అందరూ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి సందేహాలున్నా కొవిడ్ హెల్ప్డె్స్కకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల కోసం పోలీసులు రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ బయట తిరగవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

