జాషువా సందేశాత్మకమైన రచనలు రచించారు
ABN , First Publish Date - 2021-07-25T03:02:49+05:30 IST
గబ్బిలం, పిరదేసి, బాపూజీ వంటి గొప్ప సందేశాత్మకమైన రచనలు గుర్రం జాషువా రచించారని వీఎస్‌యూ వైస్ చాన్సలర్ బి.రాజశేఖర్ పేర్కొన్నారు.

వీఎస్‌యూ వైస్ చాన్సలర్ రాజశేఖర్
వెంకటాచలం, జూలై 24 : గబ్బిలం, పిరదేసి, బాపూజీ వంటి గొప్ప సందేశాత్మకమైన రచనలు గుర్రం జాషువా రచించారని వీఎస్‌యూ వైస్ చాన్సలర్ బి.రాజశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో శనివారం గుర్రం జాషువా వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం జాషువా కవితల పైన నిర్వహించిన ఆన్లైన్ జాతీయ సదస్సులో వైస్ చాన్సలర్ పాల్గొని, మాట్లాడారు. జాషువా రచనల ద్వారా సమకాలీన సమాజాన్ని తన సాహిత్యంలో తెలియజేశారన్నారు. గుర్రం జాషువా తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ధ్రువతారని పేర్కొన్నారు. ఆయన అనుభవించిన బాధలు, సమాజంలో ఎదుర్కొన్న అవమానాలను తన రచనల ద్వారా వ్యక్తపరిచారని తెలియజేశారు. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా అని, అతని రచనల్లో సామాజిక చైతన్యం కనిపిస్తుందన్నారు. ఈ సదస్సులో యోగి వేమన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మునగాల సూర్య కళావతి, వీఎస్‌యూ రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి, తెలుగు శాఖ అధిపతి డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి, పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్ సీఎస్. సాయిప్రసాద్‌రెడ్డి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాఎస్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.