వేదగిరి భద్రమేనా!?

ABN , First Publish Date - 2021-01-08T06:33:39+05:30 IST

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భద్రత విషయంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

వేదగిరి భద్రమేనా!?
నరసింహకొండ పై వేదగిరి క్షేత్రం

1334 ఎకరాల కొండపై ఆలయం 

7 కోనేళ్ల వద్ద ఏకాంతంగా గోవిందరాజస్వామి 

రాత్రుళ్లు కానరాని వాచ్‌మెన్‌ 

సీసీ కెమోరాల నిఘాతో సరి! 

రాష్ట్రంలో వరుస ఘటనలతో భక్తుల ఆందోళన


నెల్లూరు రూరల్‌, జనవరి 7 : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భద్రత విషయంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలక్ష్మి సమేతుడైన నృసింహ స్వామి కొలువైన ఈ క్షేత్రాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. పెన్నా నది తీరాన ఉన్న జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆ పక్కనే ఉన్న నరసింహకొండకు కూడా వెళ్లడం ఆనవాయితీ. అయితే ఈ కొండపై తగినంత స్థాయిలో భద్రతా సిబ్బంది, రక్షణ చర్యలు లేకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నెల్లూరు నగరానికి 12 కి.మీ దూరాన సుమారు 1334 ఎకరాల కొండ ప్రాంతంపై వేదగిరి క్షేత్రం ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లు కొలువైయున్నారు. భక్తుల కొంగు బంగారంగా స్వామివారు నిత్య పూజలందుకుంటు న్నారు. 1200 ఏళ్ల క్రితం పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయంలో రాత్రుళ్లు వాచ్‌మెన్లు ఉండగా ఉపాలయాల్లో ఆ పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఆలయానికి దిగువన కొండపై ఒకేచోట ఏడు కోనేళ్లు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. వాటిని గుండాలు అని పిలుస్తారు. వాటికి సమీపాన గోవిందరాజ స్వామి ఆలయం ఉంది. కొండ కింద దేవరపాళెంలో నృసింహ స్వామి వారి రఽథాన్ని ఉంచారు. ఆ రెండు చోట్ల రాత్రుళ్లు వాచ్‌మెన్లు ఉండటం లేదు. ఆయా ప్రాంతాల్లో కేవలం సీసీ కెమోరాల నిఘాతోనే భద్రతను ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు, విగ్రహ ధ్వంసాలు జరుగుతున్న నేపథ్యంలో గోవిందరాజ స్వామి ఆలయం, రథం వద్ద కాపలాదారులు లేకపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.


వాచ్‌మెన్లతో ఆకస్మిక తనిఖీలు 

- పీ శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈవో 

రాత్రుళ్లు గోవిందరాజస్వామి ఆలయం, రథం వద్ద వాచ్‌మెన్లతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాము. పైగా సీసీ కెమోరాలతో రాత్రంతా ఆలయ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. 


ఆలయాలకే ప్రత్యేక బీట్లు 

- శ్రీనివాసలరెడ్డి, రూరల్‌ సీఐ 

మండలంలోని ఆలయాల కోసమే ప్రత్యేక బీట్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టాము. వేదగిరిపైకి ప్రతి రాత్రి పహార బృందాలు వెళ్తున్నాయి. అన్ని గ్రామాల్లోని ఆలయాలను ఈ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. 

Updated Date - 2021-01-08T06:33:39+05:30 IST