ఇంటర్‌ ప్రశ్నపత్రం లీక్‌!

ABN , First Publish Date - 2021-12-29T05:00:28+05:30 IST

ఇంటర్‌ అర్ధ సంవత్సరం పరీక్షలు జిల్లాలో లోపభూయిష్టంగా జరుగుతున్నాయి. తొలిసారి ఇంటర్‌బోర్డే ప్రశ్నపత్రాన్ని ముద్రించి కామన పేపర్‌ను అందిస్తుండటంతో ఈ పరీక్షలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇంటర్‌ ప్రశ్నపత్రం లీక్‌!

అంగట్లో సరుకుల్లా విక్రయం

ఫిర్యాదులు అందడంతో ఇంటర్‌బోర్డు అప్రమత్తం

పేపర్లు రద్దు చేసిన అధికారులు

ఇకపై పరీక్షకు అరగంట ముందే విడుదల


నెల్లూరు (విద్య), డిసెంబరు 28 : ఇంటర్‌ అర్ధ సంవత్సరం పరీక్షలు జిల్లాలో లోపభూయిష్టంగా జరుగుతున్నాయి. తొలిసారి ఇంటర్‌బోర్డే ప్రశ్నపత్రాన్ని ముద్రించి కామన పేపర్‌ను అందిస్తుండటంతో ఈ పరీక్షలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోలా కొవిడ్‌ ఉధృతమై పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తితే ఈ మార్కులనే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉండడంతో కొందరు అక్రమాలకు తెరలేపారు. ఇంటర్‌బోర్డు అధికారులు నిర్లక్ష్యం, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ప్రశ్నపత్రాలను లీక్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర అధికారులు గుర్తించి, లీక్‌ అయిన ప్రశ్నపత్రాలన్నింటినీ మాయం చేసి వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. విషయం బయటకు పొక్కకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. అయితే అప్పటికే జెరాక్స్‌ సెంటర్‌లకు చేరిన ప్రశ్నపత్రాల వ్యవహారం విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు,  లెక్చరర్‌లకు చేరిపోయింది. దీనిపై కొందరు బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడితే వారు వెంటనే ఈ ప్రశ్నపత్రాలన్నీ రద్దు చేస్తున్నామని ప్రకటిస్తూ సంబంధిత కళాశాలలకు ఉత్తర్వులు పంపించారు. బుధవారం నుంచి జరిగే పరీక్షలకు అరగంట ముందు మాత్రమే నూతన ప్రశ్నపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.


ఒకేషనల్‌ ప్రశ్నపత్రాలు తయారీ


ఇంటర్‌బోర్డు నిర్ధేశించిన ప్రశ్నపత్రాన్ని ఆనలైనలో అందుబాటులో ఉంచి ప్రిన్సిపాళ్లకు వచ్చే ఓటీపీతో ఈ ప్రశ్నపత్రాలను డౌనలోడ్‌ చేసుకుని విద్యార్ధులకు అందచేయాలని అధికారులు ప్రకటించారు. అయితే సాంకేతికతలో ఆరితేరిన యాజమాన్యాలు ముందుగానే వాటిని డౌనలోడ్‌ చేసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి వీటిని అందచేశారు.  దీంతో అప్రమత్తమైన అధికారులు జనరల్‌ విద్యార్థుల ప్రశ్నపత్రాలతోపాటు ఒకేషనల్‌ ప్రశ్నపత్రాలను కూడా రద్దు చేశారు. అయితే సమయం లేకపోవడంతో బుధవారం నుంచి కేవలం జనరల్‌ విద్యార్థులకు మాత్రమే జ్ఞానభూమి వెబ్‌సైట్‌ ద్వారా ప్రశ్నపత్రాలు విడుదల చేస్తామని, ఒకేషనల్‌ విద్యార్థులకు విడుదల చేయలేమని బోర్డు అధికారులు తేల్చి చెప్పారు. సంబంధిత కళాశాలల్లోనే ప్రశ్నపత్రాలు సిద్ధం చేసుకుని పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకేషనల్‌ కళాశాలల యాజమాన్యాలకు ఇది బాగా కలిసొచ్చే అంశం ప్రధానంగా జిల్లాలోని వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లోని ఒకేషనల్‌ కళాశాలలకు అనుమతులు కూడా లేవని అధికారులు ఉత్తర్వులిచ్చినా పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహించారు. కొన్ని కళాశాలల్లో  విద్యార్థులు లేకపోయినా తమ అటెండర్ల చేత యాజమాన్యం పరీక్షలు రాయించడం విశేషం.

  

ఇంటర్‌ పరీక్షలకు 1939 గైర్హాజరు


ఇంటర్‌ అర్ధ సంవత్సరం పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 1939 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షల్లో జనరల్‌ విద్యార్థులు 27,036కి 26,458 మంది హాజరవగా 578 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 2,033 మందికి 1,831 మంది హాజరు కాగా 202 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 29,069 మందికి 28,289 మంది హాజరవగా 780 మంది గైర్హాజరయ్యారు. అలాగే మఽధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 27,707 మందికి 26,758 మంది హాజరవగా 949 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 2,231 మందికి 2,021 మంది హాజరవగా 210 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 29,938 మందికి 28,779 మంది హాజరు కావడంతో 1,159 మంది గైర్హాజరయినట్లు ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-12-29T05:00:28+05:30 IST