ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-03-22T04:38:38+05:30 IST

ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షల కాలం సమీపిస్తోంది.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు సన్నాహాలు

ఈనెల 31 నుంచి ప్రయోగ పరీక్షలు

జిల్లాలోని 50 కేంద్రాల్లో నిర్వహణ

24, 27 తేదీల్లో జూ,కళాశాలల్లో ఎగ్జామ్స్‌

నేడు ప్రిన్సిపాళ్లతో ఆర్‌ఐవో సమావేశంనెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) మార్చి 21: ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షల కాలం సమీపిస్తోంది. ఈ నెల 24, 27వ తేదీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆయా కళాశాలల్లోనే నైతిక ‘మానవ విలువలు’, ‘పర్యావరణ విద్య ’పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 31వ తేదీ నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 225 జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకానున్నారు.ప్రాక్టికల్స్‌ నిర్వాహణతో పాటు 24,27 తేదీలలో జరగనున్న పరీక్షలపై జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లతో  సోమవారం ఆర్‌ఐవో సమావేశం నిర్వహించ నున్నారు.


50 కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌


ఇంటర్‌ ద్వితీయ సంవత్సర సైన్స్‌ విద్యార్థులకు ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 21వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేలా ఈ కేంద్రాలకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు పరీక్ష కేంద్రాల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మోడల్‌ స్కూల్‌లు, సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలల్లోనే ఈ కేంద్రాలను నిర్వహిస్తారు.


24,27 తేదీల్లో పరీక్షలు


ఈ నెల 24వ తేదీ ఇంటర్‌ ప్రఽథమ సంవత్సర విద్యార్థులకు నైతిక మానవ విలువలు, 27వ పర్యావరణ విద్య పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. పరీక్షకు హాజరు కాకపోయినా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోయినా విద్యార్థులకు మార్కుల లిస్ట్‌లను ఇంటర్‌ బోర్డు అందించదు. అయితే ఈ రెండు సబ్జెక్టులను కళాశాలల్లో బోధించడం లేదని ఈ పరీక్షలకు విద్యార్థులు హాజరయితే చాలు పాస్‌ గ్యారెంటీ అంటూ పలు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యం చెబుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్‌ఐవో మాల్యాద్రిచౌదరి పలు కళాశాలల్లో తనిఖీ చేసి ఈ రెండు సబ్జెక్టులను భోదిస్తున్నా రా.. లేదా ?అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కళాశాలల్లో ఈ సబ్జెక్టుల గురించి తెలియదని విద్యార్థులు తెలిపినట్లు సమాచారం.

Updated Date - 2021-03-22T04:38:38+05:30 IST