ఆసుపత్రుల నుంచి పరుగు!
ABN , First Publish Date - 2021-05-22T03:50:48+05:30 IST
ఆయుర్వేద మందు కోసం వైద్యం పొందుతున్న కొవిడ్ బాధితులు కృష్ణపట్నంకు తరలివెళ్లారు. ప్రతిరోజు జీజీహెచ క్యాజువాలిటీ కరోనా బాధితులు, సహాయకులతో కిటకిటలాడేది.

కృష్ణపట్నంకు క్యూ కట్టిన కరోనా బాధితులు
నెల్లూరు (వైద్యం), మే 21 : ఆయుర్వేద మందు కోసం వైద్యం పొందుతున్న కొవిడ్ బాధితులు కృష్ణపట్నంకు తరలివెళ్లారు. ప్రతిరోజు జీజీహెచ క్యాజువాలిటీ కరోనా బాధితులు, సహాయకులతో కిటకిటలాడేది. అక్కడే అత్యవసరం కింద పడకలు కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన బాధితులకు ఆక్సిజన పెట్టేందుకు కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచారు. అయితే కరోనా మందు కోసం శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఐసీయూలో ఉన్న బాధితులు కృష్ణపట్నం వెళ్లినట్లు ఇక్కడ వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆ విభాగం బోసిపోయింది. అయితే సాయంత్రానికల్లా బాధితులు తిరిగి రావడంతో క్యాజువాలిటీలో సందడి నెలకొంది. అలాగే నగరంలోని పలు కరోనా ఆసుపత్రులలోని బాధితులలో కొందరు ప్రత్యేక అంబులెన్సలో కృష్ణపట్నంకు వెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరా
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకుంది. ఇంతగా కరోనా బాధితులకు ఉపయోగకరంగా ఉన్న మందుపై పరిశీలన జరపాలని ఆయుష్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఆయుష్ అధికారులతోపాటు ఐసీఎంఆర్ బృందాలు కూడా సాయంత్రానికల్లా జిల్లాకు చేరుకుని కృష్ణపట్నంలో పంపిణీ చేస్తున్న కరోనా మందు సాంకేతికతను పరిశీలిస్తున్నాయి. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయుర్వేద మందు పంపిణీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇందులో వాస్తవం లేదు
- హరేందిర ప్రసాద్, జేసీ
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎవరూ ఆయుర్వేద మందుకోసం కృష్ణపట్నం పోలేదు. క్యాజువాలిటీకి వచ్చే బాధితులకు వెంటనే పడకలు కేటాయించడంతో అక్కడ ఖాళీగా ఉన్నట్టు కనబడుతోంది.