ఆరోగ్య యోగం

ABN , First Publish Date - 2021-06-21T05:24:45+05:30 IST

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మన దేశం ప్రపంచానికి చాటింది. ఔషధాలతో పనిలేకుండా ఆసనాలను సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మార్గం యోగా.

ఆరోగ్య యోగం

మానసిక ఉల్లాసం... శారీరక ఉత్సాహం

కరోనాను ఎదుర్కొనే సాధనం

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం


యావత్‌ ప్రపంచాన్ని రెండేళ్లుగా కరోనా వైరస్‌ వణికిస్తోంది. కంటికి కనపడని ఆ జీవి ధాటికి కోట్లాది మందిలో కలకలం రేగింది. లక్షల మంది విగతజీవులయ్యారు. ఇంతటి విలయానికి ఆ వైరస్సే కారణమైనా సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిమిని తట్టుకునే శక్తి మనలో లేకపోవడం మరో ముఖ్యకారణం. దీనికితోడు తీవ్రమైన మానసిక ఆందోళన మరణాల రేటును పెంచిందని నిపుణుల అధ్యయం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు శారీరక దృఢత్వానికి, ఇటు మానసిక ప్రశాంతతకు అత్యవసరమైన సాధనం యోగా.  ప్రాకృతికంగా స్వస్థత చేకూర్చే దివ్య ఔషధం. శరీరంలోని అణువణువులో ఆరోగ్యాన్ని నింపి మనసును కూడా ఉల్లాసంగా మార్చే మంత్రం యోగా. 



నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూన్‌ 20 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మన దేశం ప్రపంచానికి చాటింది. ఔషధాలతో పనిలేకుండా ఆసనాలను సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మార్గం యోగా. అలాంటి యోగా విశ్వవ్యాపితం కావడానికి దేశ ప్రధాని మోదీ కృషి చేశారు. 2014లో ఐక్యరాజ సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని చేసిన ప్రతిపాదనతో ఏటా జూన్‌ 21వతేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచం జరుపుకుంటోంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ‘ఇంట్లో యోగా - కుటుంబంతో యోగా’ నినాదంతో ఈ ఏడాది ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ తప్పనిసరిగా యోగా చేయాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. మన జిల్లాలో పలువురు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా యోగా నేర్పుతున్నారు. జిల్లావ్యాప్తంగా 200 వరకు యోగా క్లబ్‌లను నెలకొల్పి జూమ్‌ యాప్‌, డిజిటల్‌ ఇండియా, వెబినార్‌ ద్వారా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 


జీవితంలో అంతర్భాగం కావాలి

ఆరోగ్యంతోపాటు ఆనందంగా జీవించడానికి యోగా దోహదపడుతుంది. దైనందిక జీవితంలో ఇది అంతర్భాగం కావాలి. క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే మానసిక ఒత్తిళ్లను దూరం చేయవచ్చు. తద్వారా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్ధంగా ఎదుర్కోగలుగుతారు.

- వీఎస్‌ సెల్వం, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి


Updated Date - 2021-06-21T05:24:45+05:30 IST