గూడూరులో గతం కంటే తగ్గిన మెజార్టీ

ABN , First Publish Date - 2021-05-03T03:32:09+05:30 IST

2019 ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలు గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి మెజార్టీ తగ్గింది. 2019లో నియోజకవర్గంలో 2,36,496 ఓట

గూడూరులో గతం కంటే తగ్గిన మెజార్టీ

గూడూరురూరల్‌, మే 2: 2019 ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలు గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి మెజార్టీ తగ్గింది. 2019లో నియోజకవర్గంలో 2,36,496 ఓటర్లు ఉండగా 1,84,602 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్‌శాతం 78.05గా నమోదైంది. ఈ ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో 2,48,222 మంది ఓటర్లు ఉండగా 1,58,389మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 63.81 ఓటింగ్‌శాతం నమోదైంది. గత ఎన్నికల్లో వైసీపీకి 46,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో 36,347 మెజార్టీ వచ్చింది. దీంతో గత ఎన్నికలతో పోల్చితే 10,034 మెజార్టీ తగ్గింది. 


 అసంతృప్తి కారణంగా తగ్గిన మెజార్టీ


   నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై అసంతృప్తి కారణంగా ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి మెజార్టీ తగ్గినట్లు పలువురు  అంటున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారాల్లో వాకాడు మండలం తూపిలిపాళెంలో ఎమ్మెల్యేపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సముద్రం ముఖద్వారం పూడికతీత పనులు చేపట్టలేదని వాపోయారు. అలాగు చిట్టమూరు మండలంలో మల్లాం, చిట్టమూరులో జరిగిన ప్రచారాల్లో ఎమ్మెల్యే సమక్షంలోనే వైసీపీలో వర్గపోరుతో వివాదాలు నెలకొన్నాయి. చిట్టమూరు మండలం బురదగాలికొత్తపాళెంలో మౌలిక వసతులు కల్పించలేదని ఎన్నికలను బహిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థులతో చర్చలు జరిపినా ఫలితంలేకుండా పోయింది. నియోజకవర్గంలో మంత్రులు, రాజ్యసభసభ్యుడు, ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గతం కంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని ప్రచారాల్లో పాల్గొనడంతోపాటు ముమ్మర ప్రయత్నాలు చేసినా గతంకంటే మెజార్టీ తగ్గింది. 


 వ్యూహాత్మకంగా టీడీపీ ప్రచారం


ఈ ఉప ఎన్నికల్లో  టీడీపీ జాతీయఅధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోలింగ్‌బూత్‌లను క్లస్టర్‌గా విభజించి ప్రతిక్లస్టర్‌కు ఒక ఇన్‌చార్జిని నియమించి ప్రతిఇంటికి ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ప్రచారాలను పర్యవేక్షిస్తూ పార్టీ నాయకులు ఉత్సాహంగా పనిచేసేలా కృషిచేశారు.  నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయడంతో గత ఎన్నికలతో పోల్చిస్తే ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ మెజార్టీని తగ్గించగలిగారు. 


Updated Date - 2021-05-03T03:32:09+05:30 IST