జీఎస్టీ వృద్ధి రేటు ఢమాల్‌

ABN , First Publish Date - 2021-01-13T04:51:56+05:30 IST

జిల్లాలో జీఎస్టీ వృద్ధిరేటు భారీగా పడిపోయింది. మైనస్‌ 18.30 శాతంగా నమోదైంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే శాఖలలో స్టేట్‌టాక్సు (కమర్షియల్‌ టాక్సు) ఒకటి. కరోనా ప్రభావం ఈ శాఖపై పడటంతో వసూళ్లలో మందగమనం ఏర్పడింది.

జీఎస్టీ వృద్ధి రేటు ఢమాల్‌

మైనస్‌ 18.30 శాతంగా నమోదు

లక్ష్యం 968.28 కోట్లు.. సాధన రూ.633.8 కోట్లు


నెల్లూరు (హరనాథపురం), జనవరి 12 : జిల్లాలో జీఎస్టీ వృద్ధిరేటు భారీగా పడిపోయింది. మైనస్‌ 18.30 శాతంగా నమోదైంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే శాఖలలో స్టేట్‌టాక్సు (కమర్షియల్‌ టాక్సు) ఒకటి. కరోనా ప్రభావం ఈ శాఖపై పడటంతో వసూళ్లలో మందగమనం ఏర్పడింది. అయితే, ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గడంతో ఆ శాఖ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తోంది. జిల్లాలో 18,207 మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా, ఈ ఏడాది 13,157 మంది జీఎస్టీ రిటర్న్స్‌ సమర్పించారు. 5,050 మంది సమర్పించలేదు. పన్ను ఎగవేతదారులు పెరిగిపోయి, ఏ నెలకానెల వృద్ధిరేటు పడిపోతోంది. 


రూ.968.28 కోట్ల లక్ష్యం


జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ల లక్ష్యం 968.28 కోట్లు. ఇప్పటివరకు రూ.633.8 కోట్ల (65.46) లక్ష్యసాధన పూర్తయ్యింది. 2018-19లో జీఎస్టీ వసూళ్ల లక్ష్యం రూ.1439.45 కోట్లు కాగా రూ.1058.80 కోట్ల లక్ష్యమే పూర్తయ్యింది. 2019-20ంలో రూ.1059.40 కోట్లకు 960.55 కోట్ల లక్ష్యాన్ని ఆ శాఖ సాధించింది. 


వాహన తనిఖీలు ఏవీ!?


జిల్లాలో స్టేట్‌ టాక్సు అధికారులు వాహన తనిఖీలను ముమ్మరంగా చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.    సరుకులు తరలిస్తున్న వాహనాలను గుర్తించి వాటిపై అపరాధ రుసుమును ఆ శాఖ అధికారులు రాబట్టాల్సి ఉంది. గత సంవత్సరం జిల్లాలో గతేడాది 3643 వాహనాలను తనిఖీ చేసి, రూ. 2.62 కోట్ల అపరాధ రుసుము రాబట్టారు. అయితే, ఈ సంవత్సరం తనిఖీలు తగ్గిపోయాయనే విమర్శలు ఉన్నాయి.


వాహనతనిఖీలు ముమ్మరం చేస్తాం

జిల్లాలో వాహన తనిఖీలు ముమ్మరం చేసి, అపరాధరుసుము రాబడతాం. జీఎస్టీ వసూళ్లను పెంచుతాం. నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు మైన్‌సలో ఉంది. వృద్ధిరేటు మరింత పెంచుతాం. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు సమర్పించేలా చర్యలు చేపడతాం.

- కల్పన, జాయింట్‌ కమిషనర్‌, స్టేట్‌టాక్సు

Updated Date - 2021-01-13T04:51:56+05:30 IST