అడ్డగోలుగా గ్రావెల్‌ తవ్వకం

ABN , First Publish Date - 2021-05-31T02:50:47+05:30 IST

పర్యావరణం, జీవవైవిద్యం పరంగా ఎంతో ప్రాధాన్యమున్న ఎర్రమట్టి కొండలవి.. నాణ్యమైన గ్రావెల్‌ లభిస్తుండడంతో అక్రమా

అడ్డగోలుగా గ్రావెల్‌ తవ్వకం
గ్రావెల్‌ కోసం తవ్వగా గుంతలు పడిన తిప్ప

 ఓ చోట అడ్డుకుంటే మరో చోట పాగా

 చోద్యం చూస్తున్న అధికారులు

పొదలకూరు, మే 30 : పర్యావరణం, జీవవైవిద్యం పరంగా ఎంతో ప్రాధాన్యమున్న ఎర్రమట్టి కొండలవి.. నాణ్యమైన గ్రావెల్‌ లభిస్తుండడంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. కొంతమంది నేతల అండతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఓచోట స్థానికులు అడ్డుకుంటే.. మరో ప్రాంతంలో పాగా వేసి దందా సాగిస్తున్నారు. పరిస్థితి ఇంతలా ఉన్నా అధికారులెవరూ ఇటుగా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మండలంలోని చిట్టేపల్లి తిప్ప, చాటగొట్ల, నందివాయి, బిరదవోలు, తాటిపర్తి పంచాయతీలోని గొల్లకందుకూరు గ్రామాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇవి ఎంతో కీలకం. వివిధ రకాల అటవీజీవులు సైతం ఇక్కడ ఆవాసం పొందుతు న్నాయి. అలాంటి కొండలను కొందరు స్వార్థపరులు పిండి చేస్తున్నారు. భారీ యంత్రాలతో గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నారు. పగలూరాత్రీ తేడా లేకుండా యథేచ్ఛగా కొండలను తొలిచేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రైవేటు లే అవుట్లకు, ఇళ్లకు ట్రక్కుల కొద్ది మట్టి తరలుతోందంటే తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. టిప్పర్‌ రూ.2వేలు,ట్రాక్టర్‌ రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. 


అన్నివిధాలా నష్టమే..


కొండలపై తవ్వకాల కారణంగా వాటిపై ఆవాసం ఏర్పరచుకున్న అటవీ జీవుల మనుగడకు ముప్పు ఏర్పడింది. ఎక్కడికక్కడ గుల్ల చేస్తుండడంతో పచ్చదనం సైతం హరించుకుపోతుంది. వర్షాల సమయంలో కొండపై నుంచి వచ్చే వరద నీటితో సమీప గ్రామాల్లోని చెరువులు, ఇతర జలవనరులకు ఇబ్బంది ఉండేదికాదు. పరిసర ప్రాంతాల పశు పోషకులు తమ పశు సంపద జీవాలను మేత కోసం ఈ కొండలపైకి తీసుకువస్తారు. అక్రమార్కుల చర్యల కారణంగా భవిష్యత్తులో ఈ పరిస్థితి కనుమరుగై అన్ని విధాలా నష్టం తప్పదు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.


Updated Date - 2021-05-31T02:50:47+05:30 IST