1న కసుమూరు గంధమహోత్సవం

ABN , First Publish Date - 2021-10-30T04:28:32+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన వలీ దర్గా 244వ గంధమహోత్సవం నవంబరు 1వ తేదీ సోమవారం రాత్రి జరగనున్నది.

1న కసుమూరు గంధమహోత్సవం
ఎమ్మెల్యే కాకాణితో మాట్లాడుతున్న దర్గా ముజావర్లు దర్గా ముజావర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి

సంప్రదాయపద్ధతిలో నిర్వహణ

గ్రామస్థులకు తప్ప బయటివారికి నో ఎంట్రీ!


వెంకటాచలం, అక్టోబరు 29 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన వలీ దర్గా 244వ గంధమహోత్సవం నవంబరు 1వ తేదీ సోమవారం రాత్రి జరగనున్నది.   మస్తాన స్వామి బంగళా నుంచి సోమవారం రాత్రి బయలుదేరిన గంధం గుర్రంపై ఉరేగింపుగా మంగళవారం తెల్లవారుజామున దర్గా వద్దకు చేరుతుంది. అనంతరం స్వామి వారికి గంధాన్ని కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ చదివింపులు ఇస్తారు. బుధవారం చిన్న గంధం ఉరేగింపు జరిపి తహ్‌లీల్‌ ఫాతేహ పంచబడుతుంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ గంధమహోత్సవంలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి, ఆర్డీవో హుస్సేన సాహెబ్‌ వెల్లడించారు. కసుమూరు గ్రామస్థులు, దర్గా ముజావర్లు తదితరులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతిస్తారని, ఇతరులెవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు.  జూమ్‌ యాప్‌ గంధమహోత్సవాన్ని వీక్షించవచ్చని పేర్కొన్నారు. 


త్వరలోనే కమిటీ ఏర్పాటు : ఎమ్మెల్యే


కసుమూరు మస్తాన వలీ దర్గా గంధమహోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి తెలిపారు. కసుమూరులో  జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కోర్టు వివాదాలను అధిగమించి, త్వరలోనే దర్గా కమిటీని నియమించి దర్గా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దర్గా అభివృద్ధి కోసం పంపిన రూ.2 కోట్ల ప్రతిపాదనను త్వరలోనే మంజూరు చేయించి, పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సమీక్షలో  డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, ఎంపీడీవో సరళ, వక్ఫ్‌ బోర్డు అధికారులు, వివిధ శాఖల అధికారులు, దర్గా ముజావర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:28:32+05:30 IST