నేటి నుంచి నామినేషన్ల ఘట్టం

ABN , First Publish Date - 2021-02-06T04:46:43+05:30 IST

నాయుడుపేటలో డివిజన్లో శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థి వెంట ఇద్దరికి మాత్రమే నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని క్లస్టర్‌ సహాయక జిల్లా ఎన్నికల అధికారులు శివప్రసాద్‌, శ్రీనివాసులు తెలిపారు.

నేటి నుంచి నామినేషన్ల ఘట్టం
స్టేజ్‌ -1 అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న క్లస్టర్‌ సహాయక జిల్లా ఎన్నికల అధికారులు

అభ్యర్థితో ఇద్దరికే అనుమతి 

క్లస్టర్‌ సహాయక జిల్లా ఎన్నికల అధికారి శివప్రసాద్‌ 

నాయుడుపేట, ఫిబ్రవరి 5 : నాయుడుపేటలో డివిజన్లో శనివారం నుంచి నామినేషన్ల  ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థి వెంట ఇద్దరికి మాత్రమే నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని  క్లస్టర్‌ సహాయక జిల్లా ఎన్నికల అధికారులు శివప్రసాద్‌, శ్రీనివాసులు తెలిపారు. శనివారం నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. నాయుడుపేట మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం స్టేజ్‌ -1 రిటర్నింగ్‌ అధికారులతో వారు సమావేశం నిర్వహించారు.   అభ్యర్థితోపాటు వచ్చిన మిగతా వారిని కేంద్రానికి వందమీటర్ల దూరంలోనే పోలీస్‌ సిబ్బంది నిలిపివేస్తారని తెలిపారు. నాయుడుపేట మండలంలో ఐదు క్లస్టర్లలో నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్‌లు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఐదు క్లస్టర్ల స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

దొరవారిసత్రం: మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ  శనివారం నుంచి ప్రారంభంకానుంది. మండలంలో 22 గ్రామ పంచాయతీలు, 200 వార్డులు ఉన్నాయి. మండలంలో 11 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. కొత్తపల్లి ఎంపీపీ స్కూల్‌, మీజూరు ఎంపీపీ స్కూల్‌, నెలబల్లి యూపీస్కూల్‌, పోలిరెడ్డిపాళెం ఎంపీపీ స్కూల్‌, పూలతోట జడ్పీ హైస్కూల్‌, తల్లంపాడు జడ్పీ హైస్కూల్‌, తనియాలి యూపీస్కూల్‌, ఉచ్చూరు ఎంపీపీ స్కూల్‌, వేణుంబాక యూపి స్కూల్‌, ఏకొల్లు ఎంపీపీ స్కూళ్లల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 11 మంది స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారులు, వారి అసిస్టెంట్‌లు మరో 11 మంది ఈ నామినేషన్ల ప్రక్రియను నిర్వహిస్తారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న అభ్యంతరాలు, 11న దరఖాస్తుదారుల జాబితా ప్రకటన,  12న ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది. ఈనెల 17న పోలింగ్‌ జరుగుతుందనీ, అదే రోజు సాయంత్రం 4 గంటల పైన కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన ఉంటుందని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. 

సూళ్లూరుపేట : మండలంలోని 19 పంచాయతీల్లో  శనివారం నుంచి సోమవారం వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.  తొమ్మిది నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దామరాయ, కోటపోలూరు, ఆబాక, మంగానెల్లూరు, కేసీఎన్‌గుంట, కడపట్ర, మంగళంపాడు, ఇలుపూరు, మన్నెముత్తేరి గ్రామాలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. 

తడ: మండలంలో నామినేషన్ల ప్రక్రియకు అధికారులు  ఏర్పాట్లు  పూర్తి చేశారు.  కారూరు, తడ, చేనిగుంట, కొండూరు, వాటంబేడుల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి నామినేషన్లు దాఖలు మొదలుకానున్నాయి. ఆది, సోమవారాలలో మంచిరోజులు కావడంతో నామినేషన్లు వేయించేందకు టీడీపీ, వైసీపీ నాయకులు తమ మద్దతుదారులను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2021-02-06T04:46:43+05:30 IST