చేపల కోసం చెరువుల లూటీ!

ABN , First Publish Date - 2021-06-23T04:44:20+05:30 IST

సాగునీటి చెరువులు ప్రధానంగా పంటకు ఉద్దేశించినవి. మొదటి ప్రాధాన్యం సాగుకే ఇవ్వాలి. కానీ ఎన్నడూ లేని విధంగా జిల్లాలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి.

చేపల కోసం   చెరువుల లూటీ!
మనుబోలు మండలం బంగారమ్మ చెరువు వద్ద నీటి విడుదలపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

పంటల కన్నా ఆదాయమే ముఖ్యమంటున్న నేతలు

రెండో పంటకు నీరిచ్చిన వేసుకోలేని పరిస్థితి

తెలిసీ పట్టించుకోని ఇరిగేషన అధికారులు

పొంచి ఉన్న తాగు, సాగునీటి ముప్పు


మనుబోలు మండలం పిడూరు గ్రామంలోని బంగారమ్మ చెరువు కింద వందల ఆయకట్టు ఉంది. 4 రోజుల క్రితం వరకు ఈ చెరువులో నీరు పుష్కలంగా ఉంది. ఆయకట్టు కింద రైతులు సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో చెరువులో నీటిని చేపల కోసం స్థానిక నేతలు దిగువకు వదిలేశారు. ఇది తెలుసుకున్న రైతులు నీటి విడుదలను అడ్డుకున్నారు. దీంతో రైతులు, నేతల మధ్య వివాదం రేగింది. చివరకు అధికారులు, పోలీసులు జోక్యం చేసుకున్నారు. అలానే పొదలకూరు, వెంకటాచలం, కావలి  తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. 


నెల్లూరు, జూన 22 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి చెరువులు ప్రధానంగా పంటకు ఉద్దేశించినవి. మొదటి ప్రాధాన్యం సాగుకే ఇవ్వాలి. కానీ  ఎన్నడూ లేని విధంగా జిల్లాలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. చాలాచోట్ల పంట కన్నా చేపలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో రెండో పంట కింద దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీటి కేటాంపులు జరిపారు. ఈ ఆయకట్ట పరిధిలోని చెరువులన్నింటినీ నీటితో నింపారు. సాగుకు సిద్ధమవుతున్న దశలో కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు చెరువుల్లోని చేపలపై కన్నేశారు. ఎటువంటి ఆదేశాలు లేకున్నా చేపల ఆదాయం కోసం చెరువుల్లోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వీటిపై రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. 


అధికారులపై ఒత్తిళ్లు


ప్రస్తుతం సాగునీటి సంఘాలు ఫోర్సులో లేవు. స్థానిక ఇరిగేషన అధికారులే నీటి యాజమాన్యాన్ని పరివేక్షించాల్సి ఉంది. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అనధికర నీటి విడుదలను వారు పట్టించుకోవడం లేదు. తాము ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ చెరువుల్లో చేపల పెంపకానికి సంబంధించి జిల్లా, మండల స్థాయిలో ఇరిగేషన, ఫిషరీస్‌ అధికారులతో కూడిన కమిటీలు ఉన్నాయి. స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో చెరువుల్లో చేపల పిల్లలను వదిలినా ఆ చేపలను పట్టే అధికారం మాత్రం కమిటీలే నిర్ణయించాలి. సాగు, తాగునీటికి ఇబ్బంది లేదనుకున్నప్పుడే చేపలు పట్టుకునేందుకు జిల్లా, మండల కమిటీలు అనుమతిస్తాయి. కానీ ప్రస్తుతం జిల్లాలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి కన్నాస్వలాభం కోసమే కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చెరువుల్లో ఉన్న నీటిని చేపల కోసం వదిలేస్తే భవిష్యత్తులో మూగజీవాలకు తాగునీటి సమస్య, ప్రజలకు భూగర్భ జలాల సమస్య ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలన్ని ఇరిగేషన అధికారులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో తెలియదన్నట్లుగా వ్యహరించడం గమనార్హం. 


సాగునీటికే మొదటి ప్రాధాన్యం


- కృష్ణారావు, ఇరిగేషన శాఖ ఇనచార్జ్‌ ఎస్‌ఈ 

చెరువుల్లోని నీటిని చేపల కోసం ఇష్టారీతిన విడుదల చేసేందుకు వీల్లేదు. చెరువుల కింద సాగునీటికే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. పలుచోట్ల చేపల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై  ఇరిగేషన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మండల స్థాయి కమిటీలు నిర్ణయం మేరకే చేపలు పెట్టుకునేందుకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-06-23T04:44:20+05:30 IST