సాగు చేద్దామా.. వద్దా!?

ABN , First Publish Date - 2021-05-08T04:35:35+05:30 IST

కష్టపడి పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం రైతులకు మరింత కష్టంగా మారింది. ప్రభుత్వం పుట్టికి రూ.16 వేల వరకు మద్దతు ధర ప్రకటించినా మార్కెట్లో ఆ ధర ఉండటం లేదు.

సాగు చేద్దామా.. వద్దా!?

రెండో పంటపై రైతుల్లో డైలమా

ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదని ఆవేదన

రికార్డు స్థాయిలో నీరిస్తున్నా పూర్తిస్థాయిలో సాగు జరిగేనా!?


ఈ ఏడాది రెండో పంటకు రికార్డు స్థాయిలో నీటి కేటాయింపులు జరిపారు.  సోమశిల, కండలేరు ప్రాజెక్టుల కింద 5.9 లక్షల ఎకరాలకు  నీరు అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఆ స్థాయిలో సాగు జరుగుతుందా!? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. రైతుల్లో ఆసక్తి తగ్గడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎక్కడైనా రైతులు నీటి కోసం ఎదురుచూస్తుంటారు. కానీ జిల్లాలో నీరిస్తామన్నా సాగు చేసేందుకు ఆలోచిస్తున్నారు. గడిచిన రెండు సీజన్లుగా వారికి ఎదురవుతున్న అనుభవాలు వారిలో సాగుపై ఆసక్తిని తగ్గిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే ఆ ధాన్యాన్ని అమ్ముకోవడం రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. గడిచిన రెండు సీజన్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 


నెల్లూరు, మే 7 (ఆంధ్రజ్యోతి) : కష్టపడి పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం రైతులకు మరింత కష్టంగా మారింది. ప్రభుత్వం పుట్టికి రూ.16 వేల వరకు మద్దతు ధర ప్రకటించినా మార్కెట్లో ఆ ధర ఉండటం లేదు. గరిష్ఠంగా రూ.14 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. చాలా చోట్ల రూ.12 వేలకే రైతులు అమ్మారు. ఇక మద్దతు ధర కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళితే సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఆ బాధలు భరించలేక దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రబీ సీజన్‌లో జిల్లాలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 8 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 20 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. అయితే పండించిన ప్రతి గింజను మద్దతు ధర కొంటామని మొదట్లో అధికారులు ప్రకటించారు. నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలును లక్ష్యం చేసుకొని గోదాములు సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానీ సీజన్‌ పూర్తయి వాస్తవానికి వచ్చే సరికి వచ్చిన దిగుబడిలో కనీసం పది శాతం కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. సాగు పెట్టుబడి భారీగా పెరిగింది. కరోనా కారణంగా కూలీల రేట్లు రెట్టింపయ్యాయి. గతేడాది ఖరీఫ్‌ సీజన్లో రైతులు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. కరోనాను సైతం లెక్క చేయకుండా పంట పండిస్తే ఆ ధాన్యాన్ని కొనేవారు లేకుండా పోయారు. ఆ సీజన్‌లో పుట్టి రూ.9 వేలకు అమ్ముకున్న దారుణ పరిస్థితులు కనిపించాయి. కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోతుండడంతోనే రబీ సీజన్‌లో తక్కువ ధరయినా దళారులకు అమ్మేసుకున్నారు. గతంలో రైతుల సమస్యలపై ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు నిరంతరం సమావేశమవుతూ నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై పట్టించుకునే తీరలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ రెండో పంట సాగు చేస్తే గతేడాది పరిస్థితులు ఎక్కడ పునరావృతమవుతాయోనన్న భయం రైతుల్లో నెలకొంది. మరి రైతులకు భరోసా లభిస్తుందా.. పూర్తిస్థాయిలో సాగు జరుగుతుందా.. అన్నది చూడాలి. 


Updated Date - 2021-05-08T04:35:35+05:30 IST