కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-01-13T03:35:23+05:30 IST

సంక్రాంతి పండుగకు కోడి పందాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం ఉందని, ఎలాంటి అనుమతులు లేనందున ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ డీ. ప్రసాద్‌రావు హెచ్చరించారు.

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్‌రావు

డీఎస్పీ ప్రసాద్‌రావు

కావలి, జనవరి 12: సంక్రాంతి పండుగకు కోడి పందాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం ఉందని, ఎలాంటి అనుమతులు లేనందున ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ డీ. ప్రసాద్‌రావు హెచ్చరించారు. డీఎస్పీ కార్యాలయంలో ఒకటో పట్టణ సీఐ కే.శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోడి పందాలు నిర్వహించవద్దని  హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తున్నందున కోడి పందాలు నిర్వహించవద్దన్నారు.  

సాంస్కృతిక కార్యక్రమాలు బంద్‌

కొవిడ్‌-19 దృష్ట్యా కలుగోళ్ల శాంభవి ఉత్సవాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులు లేవని డీఎస్సీ ప్రసాద్‌రావు తెలిపారు. అమ్మవార్ల గ్రామోత్సవం సంప్రదాయ బద్ధంగా ఎప్పటిలాగానే జరుపుకోవచ్చన్నారు. ఈ ఉత్సవాలకు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు.

సబ్‌డివిజన్‌లో నేరాలు తగ్గుముఖం

రెండేళ్లతో పోలిస్తే 2020లో కావలి సబ్‌డివిజన్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీఎస్పీ తెలిపారు. చోరీ కేసులు 2018లో 125, 2019లో 107 నమోదు కాగా 2020లో 83  జరిగాయన్నారు. ఘర్షణ కేసులు 2018లో 177, 2019లో 140, 2020లో 147 నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 2018లో 230, 2019లో 179, 2020లో 188 జరిగాయని చెప్పారు. గత ఏడాది చోరీ కేసుల్లో 79 శాతం రికవరీలు జరిగాయని చెప్పారు. గుట్కా వ్యాపారులు 21 మందిని అరెస్ట్‌ చేసి రూ.82 లక్షల సీజ్‌ చేశామన్నారు.   29 మంది గంజాయి వ్యాపారులను అరెస్ట్‌ చేసి 377 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆలయాల్లో హుండీలు చోరీ చేస్తున్న ముఠాను కూడా పట్టుకుని వారి నుంచి భారీగా రికవరీలు చేశామపేర్కొన్నారు.

Updated Date - 2021-01-13T03:35:23+05:30 IST