జలమే జగత్‌!

ABN , First Publish Date - 2021-05-03T04:39:17+05:30 IST

జిల్లాలో అన్ని వ్యాపారాల కన్నా మంచినీటి వ్యాపారం జోరందుకుంది. లీటరు నీటి కోసం ప్రస్తుతం రూ.10 వెచ్చిస్తుండగా రాబోయే పదేళ్లలో దీని ధర రూ.50 పైనే ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

జలమే జగత్‌!
ఆత్మకూరు ప్రాంతంలోని మినరల్‌వాటర్‌ ప్లాంటు

జిల్లాలో జోరుగా మంచినీటి వ్యాపారం

ఏటా ఖర్చు రూ.40 కోట్ల పైమాటే

పుట్టగొడుగుల్లా ఆర్‌వో ప్లాంట్లు

పదేళ్లలో ఆ వ్యాపారమే అగ్రగామి

ఆదాయంలో కొంతభాగం దానికే సరి

యూఎన్‌ నివేదిక వెల్లడించింది ఇదే!

రక్షిత నీటి పథకాలపై భరోసా అవసరం


ఆత్మకూరు, మే 2: జిల్లాలో అన్ని వ్యాపారాల కన్నా మంచినీటి వ్యాపారం జోరందుకుంది. లీటరు నీటి కోసం ప్రస్తుతం రూ.10 వెచ్చిస్తుండగా రాబోయే పదేళ్లలో దీని ధర రూ.50 పైనే ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పేదలు స్వచ్ఛమైన నీరు కావాలంటే వారి ఆదాయంలో సగం వెచ్చించాల్సి వస్తుందని యూఎన్‌ఏ నివేదిక వెల్లడించడం గమనార్హం. ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేసినా మినరల్‌ వాటర్‌ కొనుగోలుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో ఆర్‌వో ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇప్పటికే జిల్లాలో ఏటా రూ.40 కోట్లకుపైగా తాగునీటికే ప్రజలు ఖర్చు చేస్తున్నారంటే వ్యాపారం ఏవిధంగా జరుగుతుందో అర్థమవుతుంది. 


విచ్చలవిడిగా ఆర్‌వో ప్లాంట్లు

ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎ్‌సపేట, చేజర్ల, మర్రిపాడు, సంగం మండలాల్లో 125 ప్రభుత్వ, ప్రైవేట్‌ వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. ఆత్మకూరు మండలంలో ఏడు ప్రభుత్వ వాటర్‌ప్లాంట్‌, మరో 10 ప్రైవేట్‌ ప్లాంట్లు ఉన్నాయి. అనంతసాగరం మండలంలో 10 ప్రభుత్వ, మూడు ప్రైవేట్‌ ప్లాంట్లు, మర్రిపాడు మండలం లో 13 ప్రభుత్వ, ఆరు ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్లు, చేజర్ల మండలంలో ఆరు ప్రభుత్వ, మరో 16 ప్రైవేట్‌ ఆర్‌వో ప్లాంట్లు ఉన్నట్లు అధికారికంగా లెక్కలు ఉన్నాయి. అయితే అనధికారి కంగా మరో 50 వాటర్‌ ప్లాంట్లు నడుస్తూ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది.  


మినరల్‌ వాటర్‌తో కాసుల వర్షం 

జిల్లాకే తలమానికమైన సోమశిల ప్రాజెక్టు అనంతసాగరం మండలంలో ఉన్నా మండల వాసులు తాగునీటికి వాటర్‌ క్యాన్లపైనే అధికంగా ఆధారపడుతున్నారు. ఆత్మకూరు పుర ప్రజలకు దాహార్తి తీర్చేందుకు రూ.67 కోట్లతో సోమశిల జలాలను ఆత్మకూరుకు తరలించి రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినా ప్రజలు ఆర్‌వో ప్లాంట్ల నుంచి వచ్చే వాటర్‌ క్యాన్లు కొనేందుకే ఎగబడుతున్నారు. 

ఏఎ్‌సపేట మండలంలో 10 మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 1000 నుంచి 1500 క్యాన్ల నీటిని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తుంటారు. క్యాన్‌ రూ.10 నుంచి గిరాకీని బట్టి రూ.40 వరకు అమ్ముతున్నారు. ఒక్క ఏఎ్‌సపేటలోనే రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. ఏఎ్‌సపేటలో యాత్రికులను బట్టి క్యాన్‌ వాటర్‌ రూ.10 నుంచి రూ.40 వరకు అమ్ముతున్నారు. గ్రామంలోని బోర్లలో ఉప్పునీరు వస్తుండడం, పంచాయతీ కొళాయిల్లో వచ్చే పెన్నా వాటర్‌ గ్రామస్థులకే సరిపోకపోవడంతో యాత్రికులు మినరల్‌ వాటర్‌పై ఆధారపడుతున్నారు.  

 సంగం మండలంలో మొత్తం నాలుగు మినీ వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. ప్రతి నిత్యం 1000 క్యాన్ల వరకు అమ్ముడవుతున్నాయి. పెరమనలో ప్రభుత్వ వాటర్‌ప్లాంట్‌ నుంచి 20 లీటర్ల క్యాన్‌ను రూ.2లకే గ్రామస్థులకు సరఫరా చేస్తున్నారు. ల్యాంకో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అమరపునాయుడుకండ్రిగలో నిర్వహిస్తున్న మినీ వాటర్‌ప్లాంట్‌ వద్ద ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సంగంలో ఉన్న రెండు ప్రైవేట్‌ మినీ వాటర్‌ప్లాంట్ల వారు క్యాన్‌ రూ.10 వంతున విక్రయిస్తున్నారు. బస్టాండ్‌, కూల్‌డ్రింక్‌ షాపుల్లో లూజు వాటర్‌ లీటర్‌ రూ.5 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. 

 అనంతసాగరం మండలంలోనూ ఎక్కువమంది మినరల్‌వాటర్‌కు అలవాటు పడడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. 75 శాతం ప్రజలు మినరల్‌వాటర్‌ను ఉపయో గిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్క క్యాన్‌కు రూ.10 అమ్ముతుండగా ఎండలు కావడంతో రూ.2 అదనంగా పెంచారు. 


చిల్లరగా వ్యాపారం

ఇక మండల కేంద్రాలు, గ్రామాల్లో టిఫిన్‌ చేస్తే అక్కడే నీళ్లుండేవి. వాటినే తాగేవారు. ప్రస్తుతం టీకొట్టు దగ్గర నుంచి హోటళ్ల వరకు ఎక్కడ చూసినా అర లీటరు రూ.2, లీటరు రూ.4 చొప్పున విక్రయిస్తున్నారు. 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌కు ఆర్‌వో ప్లాంట్‌ వ్యాపారులు రూ.10 విక్రయిస్తుంటే దాన్ని చిల్లరగా దుకాణాల్లో రూ.80లకు అమ్ముకుంటున్నారు. ప్రజల్లో ఆర్‌వో ప్లాంట్ల నుంచి వచ్చేదే శుభ్రమైన తాగునీరనే భావన నెలకొంది. ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాలపై భరోసా కల్పించి వాటిని తాగడం అలవాటు చేసుకునే దిశగా అవగా హన కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే 2030 నాటికి యూఎన్‌ఏ నివేదిక చెప్పేదే నిజం కానుంది.  

Updated Date - 2021-05-03T04:39:17+05:30 IST