స్టోన్‌హౌస్‌పేటను పొట్టిశ్రీరాములునగర్‌గా మార్చండి

ABN , First Publish Date - 2021-02-06T04:32:00+05:30 IST

నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట ప్రాంతాన్ని శ్రీ పొట్టిశ్రీరాములు నగర్‌గా మార్చాలని తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు.

స్టోన్‌హౌస్‌పేటను పొట్టిశ్రీరాములునగర్‌గా మార్చండి
పుచ్చలపల్లి సుందరయ్య బొమ్మను శుభ్రం చేస్తున్న కోటంరెడ్డి

టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), ఫిబ్రవరి 5 : నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట ప్రాంతాన్ని శ్రీ పొట్టిశ్రీరాములు నగర్‌గా మార్చాలని తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన పొట్టిశ్రీరాములు విగ్రహంతోపాటు మహనీయుల విగ్రహాలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆత్మకూరు బస్టాండు కూడలిలో ఆందోళన చేపట్టారు. కోటంరెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అప్పటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఫ్లైఓవర్‌ వంతెనలకు మహనీయుల చిత్రాలను గీయించి ఆకర్షణీయంగా తయారుచేస్తున్న సమయంలో ప్రభుత్వం మారిందన్నారు.  నగరాన్ని సుందరంగా తయారు చేస్తామన్న మంత్రి అనిల్‌ మాటలు నీటిమీద రాతల్లా మారాయని విమర్శించారు. ఆర్యవైశ్య నాయకుడు బ్రహ్మంగుప్తా మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు ఐల్యాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్‌ వంతెన పిల్లర్లకు అంటించిన కాగితాలను కోటంరెడ్డి స్వయంగా తొలగించారు. మహనీయుల బొమ్మలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, రేవతి, సత్యనాగేశ్వరరావు, ఉచ్చి భువనేశ్వరీప్రసాద్‌, ఆకుల హనుమంతు, పసుపులేటి మల్లికార్జున, మామిడాల మధు, ఆర్యవైశ్య నాయకులు ఆర్‌కేటీ శేషయ్య, కొండా ప్రవీణ్‌, సురేష్‌, కోట మధు, దాక్షాయిణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:32:00+05:30 IST