దసరా.. వచ్చిందయ్యా!
ABN , First Publish Date - 2021-10-07T03:55:46+05:30 IST
శక్తి, ఆనందం, చైతన్యం మూర్తీభవించిన పార్వతీమాతను విద్య, ఆరోగ్యం, ఆయుష్షు, విజయం, శుభప్రదమైన ఫలితాలను అందించమని ప్రార్థించగలిగే రాత్నులే నవరాత్రులు.
నవరాత్రి ఉత్సవాలకు ఆలయాల ముస్తాబు
రోజుకో అలంకరణలో అమ్మవార్ల వైభోగం
ఈసారీ కరోనా ఆంక్షలు
పరిమితంగానే ఊరేగింపులు
నెల్లూరు (సాంస్కృతికం), అక్టోబరు 6 : శక్తి, ఆనందం, చైతన్యం మూర్తీభవించిన పార్వతీమాతను విద్య, ఆరోగ్యం, ఆయుష్షు, విజయం, శుభప్రదమైన ఫలితాలను అందించమని ప్రార్థించగలిగే రాత్నులే నవరాత్రులు. విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగలో దేవీ నవరాత్రులే అత్యంత ప్రధానమైనవి. శరదృతువులో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవిమి వరకు ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. అలాంటి ఉత్సవాలకు జిల్లాలోని అన్ని ఆలయాలు ముస్తాబయ్యాయి. తొమ్మిది రోజులపాటు రోజుకో అలంకరణలో అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారు. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో గతేడాది నవరాత్రి ఉత్సవాలు రద్దు అయ్యాయి. కేవలం అంతరాలయానికే పూజలను పరిమితం చేసి, అతికొద్దిమంది భక్తులకే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఆలయ ధర్మకర్తలు, అధికారులు కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూలైన్లలో శానిటైజర్లు, మాస్క్‌లు, భౌతికదూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించి ఆలయానికి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంతోపాటు వైష్ణవ ఆలయాల్లో బుధవారం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకాగా, మిగిలిన ఆలయాల్లో గురువారం ప్రారంభం కానున్నాయి. సూళ్లూరుపేటలో చెంగాళమ్మ, గూడూరు రాజరాజేశ్వరి, పెంచలకోన, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ ఏడాది నుంచి నవరాత్రి ఉత్సవాలు, హోమాలు, అలంకరణలు జరగనున్నాయి. నెల్లూరు రాజరాజేశ్వరి, స్టోనహౌ్‌సపేటలో వాసవీ కన్యకాపరమేశ్వరి, ఇరుకళల పరమేశ్వరి, మూలస్థానేశ్వరి తదితర ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం
ఈ ఏడాది జిల్లాలోని అన్ని ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. క్యూలైన్లు, భౌతికదూరం, మాస్క్‌లు, శానిటైజేషన వంటి కరోనా జాగ్రత్తలను ప్రతి ఆలయంలో పాటించాల్సిందే. విజయదశమి రోజు జరిగే నగరోత్సవాలు, ఊరేగింపులు పరిమితం చేశారు.
- పి.శ్రీనివాసులురెడ్డి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్
సౌభాగ్యలక్ష్మిగా ఆదిలక్ష్మి
రాపూరు : పెంచలకోన క్షేత్రంలో పెంచల నృసింహుడి పట్టమహిషి ఆదిలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం కలశస్థాపనతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మూలవిరాట్‌ను బంగారుచీరతో విశేషంగా అలంకరించి, అర్చకులు కలశస్థాపన చేసి పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మకర్తల మండలి చైర్మన చెన్ను తిరుపాల్‌రెడ్డి, ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలయం వద్ద విద్యుద్దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది.
రెండు రాష్ట్రాల ఆరాధ్యదైవం...
సూళ్లూరుపేట : తెలుగు, తమిళ ప్రజల ఆరాధ్యదైవం సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో గురవాఆరం నుంచి 15వ తేదీ వరకు శరన్నవరాత్రుల ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో ప్రతి రోజు చండీయాగం నిర్వహించనున్నారు. 7వ తేదీ కలశస్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదే రోజు పరమేశ్వరి అలంకారం, 8వ తేదీ బాలత్రిపుర సుందరి, 9వ తేదీ గాయత్రి, 10న అష్టకాళి, 11న ఉదయం అన్నపూర్ణ, సాయంత్రం మహాలక్ష్మి , 12న సరస్వతి , 13న దుర్గాదేవి, 14న రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మణ్ణి దర్శనం ఇవ్వనుంది. 15న విజయదశమి సందర్భంగా అమ్మణ్ణిని మహిషాసుర మర్ధినిగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ చైర్మన దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
కామాక్షితాయి సన్నిధిలో..
బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడ ఆలయంలో కామాక్షితాయి శరన్నవ రాత్రోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు ఆలయం విద్యుద్దీపాలంకరణ, రంగులతో ముస్తాబైంది. 7న కలశస్థాపన, శుక్రవారం త్రిపురాంబికదేవి అలంకారం, శనివారం రక్తబీజవధ, ఆదివారం మధుకైటభవధ, రాజరాజేశ్వరి, సోమవారం బంఽడాసురవధ, మంగళవారం సరస్వతి, బుధవారం దుర్గాదేవి (దుర్గాష్టమి) అలంకారం, 14న మహిషాసురమర్దిని (మహర్నవమి), 15న విజయదశమి సందర్భంగా శమీపూజ, అశ్వవాహనసేవ, రాత్రి ఏకాంతసేవతో నవరాత్రోత్సవాలు ముగియనున్నాయని ఆలయ కమిటీ చైర్మన చీమల రమే్‌షబాబు, సభ్యులు, ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నవరాత్రోత్సవాల సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు.
నేటి నుంచి కలుగోళ్ల శాంభవి శరన్నవరాత్రులు
కావలి (టౌన) : పట్టణ గ్రామదేవత కలుగోళ్ల శాంభవి అమ్మవారి దసరా ఉత్సవాలు గురువారం ప్రారంభమం కానున్నాయి. 7న బాలత్రిపుర సుందరీ దేవిగా యాళి వాహన సేవ, 8న మహాగౌరీ అలంకారంలో చిలక వాహన సేవ, 9న అన్నపూర్ణాదేవిగా నందివాహన సేవ, 10న మహాలక్షీదేవీగా అశ్వవాహన సేవ, 11న రాజరాజేశ్వరీదేవిగా శేషవాహన సేవ, 12న సరస్వతీదేవిగా హంసవాహన సేవ, 13న దుర్గాదేవిగా పులివాహన సేవ, 14న మహిషాసురమర్ధినిగా సింహవాహన సేవ, 15న కలుగోళ్ల శాంభవిదేవిగా దర్శనమిచ్చి గజవాహన సేవలందుకోనున్నారు.
సీతారామపురం : ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఘటిక సిద్ధేశ్వరంలో ఇష్టకామేశ్వరీదేవి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 7వ తేదీన సిద్ధేశ్వరిదేవి, 8న బాలత్రిపురసుందరీదేవి, 9న గాయత్రీదేవి, 10న లలిత త్రిపుర సుందరీదేవి, 11న మహాలక్ష్మీదేవి, 12న సరస్వతీదేవి, 13న దుర్గాదేవి, 14న మహిషాసురమర్ధినీదేవి, 15న రాజరాజేశ్వరీదేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
సంగం : పెన్నానది ఒడ్డున వెలసిన కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో గురువారం నుంచి 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 7న కామాక్షిదేవి అలంకారం, 8న గాయత్రిదేవి, 9న లక్ష్మీదేవి, 10న బాలత్రిపుర సుందరిదేవి, 11న అన్నపూర్ణదేవి, 12న సరస్వతిదేవి, 13న దుర్గాదేవి, 14న మహిషాసురమర్థిని, 15న రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు కొవిడ్ నిబంధనల మేరకు మాస్క్, భౌతికదూరం పాటించాలని ఈవో కె.పెంచల వరప్రసాద్ కోరారు.
ఆత్మకూరు : ఆత్మకూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, జ్వాలాముఖి, తిరునాళ్ళతిప్ప దుర్గామల్లేశ్వరి ఆలయం, శివాలయంలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు వివిధ అలంకరణల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన మివ్వనున్నారు.
అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు గ్రామ సమీపంలో దుర్గామల్లేశ్వర ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతాయి.
తోటపల్లిగూడూరు : జ్వాలాముఖి ఆలయంలో గురువారం శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన కోసూరు రవీంద్రయ్య తెలిపారు. ఈవో తాతా శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రతిరోజు రాత్రి 9గంటలకు అమ్మవారికి పల్లకీసేవ జరుగుతుందని, అలాగే ఉదయం అభిషేకం, రాత్రి నవావరణ పూజలు జరుగుతాయన్నారు. ప్రత్యేకించి 12వ తేదీ రాత్రి సరస్వతీపూజ, 13వ తేదీ దుర్గాష్టమి పూజలు, 14న మహార్నవమి, 15న విజయదశమి పూజలు జరుగుతాయని పేర్కొన్నారు.
