కోలుకున్నా కుంగదీస్తోంది!

ABN , First Publish Date - 2021-08-28T05:01:20+05:30 IST

ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నారు. అయితే నాలుగురోజుల క్రితం గుండె పోటుతో నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు.

కోలుకున్నా  కుంగదీస్తోంది!

చుట్టేస్తున్న ప్రాణాంతక వ్యాధులు

స్టెరాయిడ్స్‌ వాడకంతో గడ్డ కడుతున్న రక్తం

ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావం

ఇప్పటికే గుండెపోటు, పక్షవాత బాధితులెందరో!

నెలకొకసారి పరీక్షలు చేయించుకోవాలి

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు


నెల్లూరు (వైద్యం) ఆగస్టు 27 : ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి కరోనా నుంచి  కోలుకున్నారు. అయితే నాలుగురోజుల క్రితం గుండె పోటుతో నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు.  రక్తం గడ్డకట్టి ఉండటం వల్ల గుండెకు రక్తం సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు వచ్చినట్లు వైద్యులు  నిర్ధారించారు. కరోనా నుంచి కోలుకున్నా వైద్య చికిత్సలు కొనసాగించక పోవటం వల్లే గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే చికిత్స అందించడంతో బాధితుడు కోలుకుంటున్నారు.

అల్లూరుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఇటీవల నెల్లూరులోని ఓ న్యూరాలజిస్ట్‌ వద్దకు తీవ్ర అనారోగ్యంతో వచ్చాడు. బాధితుడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత మెదడుకు సరైన రీతిలో రక్తం అందడం లేదని  వైద్యులు గుర్తించారు. త్వరలో అతను బ్రెయినస్టోక్‌కు గురయ్యే అవకాశం ఉందని గుర్తించి, వెంటనే వైద్యచికిత్సలు ప్రారంభించారు. 

నెల్లూరు నగరానికి చెందిన ఓ యువతి కరోనా నుంచి కోలుకుంది. అయితే, ఆ యువతి మానసిక ఆందోళన, కుంగుబాటు, నిద్రలేక పోవడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. కరోనా పేరు చెబితేనే భయం  భయాందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు కుటుంబసభ్యులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు బాధితురాలిని మానసిక వైద్యుని వద్ద చికిత్స చేయిస్తున్నారు. 


కంటికి కనిపించని శత్రువు కరోనా బారినపడి కోలుకున్నా దాని ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది.  వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువ మంది ఇంకా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. కోలుకున్నవారిలో 30 శాతం మందికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు బలహీనంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఎక్స్‌రేలో బాగానే ఉన్నా పల్మనరీ ఫంక్షన టెస్ట్‌ చేయిస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం 50 శాతం తగ్గిపోయినట్లు తెలుస్తుందని వారు స్పస్టం చేస్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తరచూ స్పృహ తప్పడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు మరో 40 శాతం మందికి వస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా వల్ల, వాడే మందుల వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రక్తం పలుచబడేలా మందులు కొనసాగించాల్సి ఉంది. అయితే చాలా మంది ఇలాంటి మందులను సక్రమంగా వాడక పోవటంతో రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువయి గుండె పోటుకు గురవుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఎంతో మంది గుండెపోటు, గుండెకు సంబంధిత వ్యాధులతో ప్రతిరోజూ తమ ఆసుపత్రికి వస్తున్నట్లు గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా నరాలపై పడుతుండటంతో పక్షవాతానికి గురయ్యే వారు ఎక్కువగా ఉన్నారని న్యూరాలజిస్ట్‌లు వెల్లడిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోక పోవటంతో శరీరంలో ప్రధాన అవయవాలపై ప్రభావం చూపి చివరికి మరణాలకు దారి తీస్తున్నట్లు పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 


కోలుకున్న 1.36 లక్షల మంది


గతేడాది మార్చిలో జిల్లాలో తొలి కరోనా కేసు నమోదవగా, గురువారం వరకు 1,39,464 కరోనా పాజిటివ్‌లు రికార్డుకెక్కాయి. వీరిలో 1,36,181 మంది కరోనా నుంచి కోలుకోగా, 989 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు మృతి చెందారు. కోలుకున్న పోస్ట్‌ కొవిడ్‌ కేసులలో 55 శాతం మందిలో మూత్రపిండాలు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రోగనిరోధక శక్తి బాగా తగ్గి రక్తం చిక్కబడటం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణాల వల్ల కాళ్లు, చేతులలో రక్తపు గడ్డలు ఏర్పడి చివరకు గాంగ్రీనకు దారి తీస్తున్నట్లు వైద్య నిపుణుల అధ్యయనాల్లో తేలింది. 


ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి

కరోనా నుంచి కోలుకున్న వారు తప్పనిసరిగా నెలకొకసారి అన్ని ప్రధాన అవయవాలకు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి. ప్రత్యేకించి మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి.

కరోనా నుంచి కోలుకున్న వారిలో 30 నుంచి 40 రోజులు యాంటీబాడీస్‌ ఉంటాయి. అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని వైద్యుల సలహాలు పాటించాలి.

గుండె దడ, మానసిక ఆందోళనల నుంచి బయట పడాలంటే ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి. నడక, వ్యాయామం విధిగా చేయాలి.

రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒంటరితనం నుంచి బయట పడేందుకు ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపాలి.

సమతుల్య పోషకాహారం, తాజాగా వండిన తేలికైన ఆహారం తీసుకోవాలి. నిద్రతోపాటు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. ప్రధానంగా ధూమ, మద్యపానం వంటి వాటి జోలికి పోరాదు.


గుండె వ్యాధులు ఎక్కువే 


కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులను గుర్తిస్తున్నాం. బాధితులు స్టెరాయిడ్స్‌ వంటివి వాడటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెపోటు బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. రక్తం పలచబడే మందులు కొంతకాలం వాడాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

- డాక్టర్‌ శ్రీనివాసరాజు, గుండె వైద్య నిపుణులు, కిమ్స్‌ ఆసుపత్రి


పక్షవాతానికి దారి తీస్తుంది!


కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులలో కొంతమంది మందులు సక్రమంగా వాడక పోవడంతో మెదడుకు వెళ్లే రక్తనాళాలలో సమస్యలు ఏర్పడి బ్రెయినస్ర్టోక్‌కు దారితీసి పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి బాధితులు ఆసుపత్రికి ఎక్కువగా వస్తున్నారు. వారిని వెంటనే గుర్తించి చికిత్స అందిస్తుండటంతో కోలుకుంటున్నారు. అలాగే కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీని ప్రభావం మెదడుపై పడి జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక సమస్యలు తలెత్తడం జరుగుతోంది.

- డాక్టర్‌ దీక్షాంతి నారాయన, న్యూరాలజిస్ట్‌, మెడికవర్‌ ఆసుపత్రి

Updated Date - 2021-08-28T05:01:20+05:30 IST