‘చిట్టేడు’లో మరో 19 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-09-04T04:41:39+05:30 IST

కోట మండలం చిట్టేడులోని యానాదుల గురుకుల కళాశాల, పాఠశాలల్లో నాలుగు రోజులుగా కరోనా విజృంభిస్తోంది.

‘చిట్టేడు’లో మరో 19 మందికి పాజిటివ్‌
చిట్టేడు గురుకులంలో వైద్యసిబ్బందితో మాట్లాడుతున్న అధికారులు

గురుకులాన్ని పరిశీలించిన అధికారులు


కోట, సెప్టెంబరు 3 : కోట మండలం చిట్టేడులోని యానాదుల గురుకుల కళాశాల, పాఠశాలల్లో నాలుగు రోజులుగా కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం మరో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో ఆగమేఘాలపై బాధితులను గూడూరు కొవిడ్‌ సెంటర్‌కు తరలించారు. ఐటీడీఏ పీవో కనకదుర్గ, తహసీల్దారు పద్మావతి, ఎంపీడీవో భవాని, ఎంఈవో వెంకటసునీల్‌ గురుకులాన్ని సందర్శించి శానిటేషన్‌ చేయించారు. మిగతా విద్యార్థులు, ఉపాధ్యాయులకు నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. కాగా గూడూరు ఏరియా ఆసుపత్రిలో కరోనా బాధితులను ఆర్డీవో మురళీ కృష్ణ, ఎమ్మెల్యే వరప్రసాద్‌ పరామర్శించారు.

మనుబోలు : మండలంలోని గొట్లపాళెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కరోనా సోకింది. వెంటనే మనుబోలు పీహెచ్‌సీ సిబ్బంది పాఠశాలకు చేరుకుని మిగతా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, పంచాయతీలో వరుసగా కేసులు నమోదవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 


జిల్లాలో 186 కరోనా కేసులు


నెల్లూరు(వైద్యం) : జిల్లాలో శుక్రవారం 186 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,658లకు చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకోలేక ఒకరు మృతి చెందగా, కోలుకున్న 173  మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. ఇదిలా ఉంటే జిల్లవ్యాప్తంగా 349 మందికి వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ వేశారు.


టీచర్ల అవార్డుల ప్రదానం రద్దు


నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఈ నెల 5వ తేది జరగవలసిన ఉపాధ్యాయ దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కొవిడ్‌ కారణంగా రద్దు చేసినట్లు డీఈఓ పి రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

అలాగే అమరావతిలోని సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేందుకు జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు 9వ తేదీలోపు ప్రతిపాదనలను పంపాలని మరో ప్రకటనలో డీఈవో కోరారు. 

Updated Date - 2021-09-04T04:41:39+05:30 IST