అచ్చేదిన్ పోయి... చచ్చేదిన్ వచ్చింది
ABN , First Publish Date - 2021-07-09T03:53:46+05:30 IST
ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ప్రజలకు అచ్చేదిన్ పోయి చచ్చేదిన్ వంటి పరిస్థితులు దాపురించామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై గురువారం నెల్లూరులోని గాంధీబొమ్మ పెట్రోలు బంక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, సంతకాల సేకరణ చేపట్టారు.

కార్పొరేట్లకు రాయితీలు... ప్రజలకు పన్నులా?
పెట్రో ధరలపై 17వరకు నిరసన
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
నెల్లూరులో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
నెల్లూరు(వైద్యం), జూలై 8 : ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ప్రజలకు అచ్చేదిన్ పోయి చచ్చేదిన్ వంటి పరిస్థితులు దాపురించామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై గురువారం నెల్లూరులోని గాంధీబొమ్మ పెట్రోలు బంక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, సంతకాల సేకరణ చేపట్టారు. ముందుగా ఇందిరాభవన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న శైలజానాథ్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇస్తున్న కేంద్రం ప్రజలపై మాత్రం పన్నుల రూపంలో ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. గడచిన రెండేళ్లలో విపరీతంగా పెట్రోలు, డీజిల్, వంటనూనె, గ్యాస్ ధరలను పెంచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్‌పై రూ.5.30 పన్నులు విధిస్తోందని ఆరోపించారు. ధరల పెంపుపై ఈ నెల 17వ తేదీ వరకు వివిధ రీతుల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తులో ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వం మరిచి అధిక పన్నులు వేసి దోచుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. ఒక్కసారి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై పన్నుల భారం మోపటం దుర్మార్గమన్నారు. అనంతరం ధరల పెంపునకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఉడతా వెంకట్రావ్, చింతాల వెంకట్రావ్, షేక్ ఫయాజ్, దుద్దుకూరి రమేష్ నాయుడు, పరిమళ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి లేళ్లపల్లి సురేష్‌బాబు, భవానీ నాగేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాల సుధాకర్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఏటూరి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.