కమీషన్లకు కక్కుర్తిపడే నువ్వా నాపై ఆరోపణలు చేసేది!

ABN , First Publish Date - 2021-08-28T05:05:00+05:30 IST

‘‘ఐదు, పది వేల రూపాయల కమీషన్ల కోసం కక్కుర్తి పడే నువ్వా నాపై అవినీతి ఆరోపణలు చేసేది.

కమీషన్లకు కక్కుర్తిపడే నువ్వా   నాపై ఆరోపణలు చేసేది!

అభివృద్ధి ఎవరు చేశారో తేల్చుకుందాం రా

ఎమ్మెల్యే మేకపాటికి బొల్లినేని సవాల్‌


ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 27 : ‘‘ఐదు, పది వేల రూపాయల కమీషన్ల కోసం కక్కుర్తి పడే నువ్వా నాపై అవినీతి ఆరోపణలు చేసేది. గ్రామాల్లో అభివృద్ధి ఎవరు చేశారో రా తేల్చుకుందాం!’’ అని  మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొల్లినేని వెంకటరామారావు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. శుక్రవారం ఉదయగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన సొంత పంచాయతీలో ఓ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని తొడగొట్టి సవాల్‌ విసరడం పద్ధతి కాదన్నారు. ‘‘పూర్తిగా కాలు పైకెత్తితే కిందపడే నీకు ఇలాంటి సవాళ్లు పనికిరావు. ఇద్దరం కలిసి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో తిరుగుదాం. ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే చెబుతారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌. ఇద్దరం ఎన్నికలకు వెళదాం. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతా. నీ రెండున్నరేళ్ల పాలనలో చేసిన అవినీతి, అక్రమాలు కార్తీకదీపం సీరియల్‌లా నా దగ్గర చిట్టా ఉంది. అవసరమైన రోజు అది బయటపెడతా. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్సుగా మారిన నువ్వు నా హయాంలో పర్సంటేజీలు తీసుకొన్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. ఇలాంటి చౌకబారు సవాళ్లు మాని ముందు మీ మేనల్లుడు రాస్తున్న ఉత్తరాలకు సమాధానం చెప్పు. నోరు అదుపులో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే నేను కూడా సహకరిస్తా’’నని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ నేతలు చెంచలబాబు యాదవ్‌, చింతనబోయిన బయ్యన్న, బొల్లినేని రామారావు, గడ్డం వెంకటేశ్వర్లు, రియాజ్‌, బొజ్జా నరసింహులు, నల్లిపోగు రాజా, నరసింహా, సందానీ, ఎంఏ అలీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-28T05:05:00+05:30 IST