చెత్త సేకరణలో ‘మూడంచెల విధానం ’

ABN , First Publish Date - 2021-06-22T03:22:39+05:30 IST

జిల్లాలో నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి మున్సిపాలిటీలు, అల్లూరు, బుచ్చి నగర పంచాయతీల్లో చెత్త సేకరణ విధానంలో కొత్త మార్పులు చేశారు.

చెత్త సేకరణలో   ‘మూడంచెల విధానం ’
బుచ్చిలో చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తున్న కమిషనర్‌ శ్రీనివాసులు (ఫైల్‌)

తడి, పొడి, ప్రమాదకర చెత్తగా విభజన 

స్లమ్‌, నాన స్లమ్‌ ప్రాంతాలలో యూజర్‌ చార్జీలు 

నెల్లూరులో పైలెట్‌ ప్రాజెక్టుగా 12 డివిజన్లు 

మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు వార్డుల ఎంపిక 

‘క్లీన ఏపీ’ కింద జులై 8న కొత్త వాహనాలు రాక 


నగర, మున్సిపల్‌ కేంద్రాల్లోని పారిశుధ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. మూడంచెల విధానంలో చెత్తను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కొన్ని డివిజన, వార్డులను పైలెట్‌ ప్రాజెక్టుల కింద ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇళ్లలోనే తడి, పొడి, ప్రమాదకర చెత్తగా విభజించి  అందచేయాల్సిందిగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జులై 8వ తేదీన చెత్త సేకరణకు అవసరమైన వాహనాలను ప్రభుత్వం అందచేయనున్నది. ఇందుకు స్లమ్‌, నానస్లమ్‌ ప్రాంతాలలో స్థానిక అధికారుల నిర్ణయం మేరకు యూజర్‌ చార్జీలను విధించనున్నారు. 


నెల్లూరు (సిటీ), జూన 21 : జిల్లాలో నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి మున్సిపాలిటీలు, అల్లూరు, బుచ్చి నగర పంచాయతీల్లో చెత్త సేకరణ విధానంలో కొత్త మార్పులు చేశారు. పారిశుధ్యం మెరుగునకు మూడంచెల విధానంలో సమీకరించాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయం మేరకు అమల్లోకి తీసుకువచ్చారు. తడి, పొడి చెత్తను ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే సేకరిస్తుండగా, దీంతోపాటు ప్రమాదకర చెత్తగా గుర్తించిన దానిని మూడంచెల్లో కలిపి విడివిడిగా ఇళ్ల నుంచే సేకరణకు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలుకు కొన్ని డివిజన్లు, వార్డులను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి తొలుత అక్కడ అమలు చేయాలని ఆయా అధికారులకు ఆదేశాలు అందాయి.  ఇందులో భాగంగా నెల్లూరులో 12 డివిజన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఒకటి, రెండు వార్డులను ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. వంట గదిలో వచ్చేది తడి చెత్తగాను, తడిలేనిది పొడి చెత్తగాను, పట్టుకునేందుకు వీలు లేనిది ప్రమాదకర చెత్తగానూ విభజించిన పురపాలక శాఖ వాటిని మూడు డస్ట్‌ బిన్లలో వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్‌ వాహనాల్లో వాటిని అందచేయాల్సిందిగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 


యూజర్‌ చార్జీలు విధింపు 


క్లీన ఆంధ్రప్రదేశలో భాగంగా ఈ విధానం అమలుకు  ప్రాథమికంగా యూజర్‌ చార్జీలను అధికారులు విధించారు. నెల్లూరులో మురికివాడల్లో ఇంటికి రూ.30, ఇతర ప్రాంతాలలో రూ.60 చొప్పున (నెలకు) వసూలుకు సిద్ధమయ్యారు. నెల్లూరు మినహా ఇతర మున్సిపాలిటీల్లో రెసిడెన్షియల్‌, నాన రెసిడెన్షియల్‌ ప్రాంతాలుగా తీసుకుని యూజర్‌ చార్జీలు విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఇంటింటా చెత్త చెత్త సేకరణకు అవసరమైన వాహనాలను జులై 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా అందచేయనున్నది. అవి జిల్లాకు చేరుకోగానే పూర్తి స్థాయిలో మూడంచెల విధానంలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త చేరకూడదన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం క్లీన ఏపీ కింద (క్లాప్‌) ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. కాగా నెల్లూరులో 54 డివిజన్లు ఉండగా నిత్యం 300 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. మూడంచెల విధానం అమలుకు 16, 21, 22, 23, 29, 42, 45, 49, 51లతో పాటు మరిన్ని డివిజన్లు కలుపుకుని మొత్తంగా 12 డివిజన్లను ఎంపిక చేశారు. ఇక్కడ ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 


ప్రజల భాగస్వామ్యం ముఖ్యం 

పారిశుధ్యంలో ఈ కొత్త విధానం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. చెత్తను వేరు చేసి మున్సిపల్‌ వాహనాలకు అందిస్తే బయటెక్కడా చెత్త కనిపించదు. దీనివల్ల రోగాలు ప్రబలవు. దోమలు బెడద  కైడా తగ్గుతుంది. దీనిపై ప్రజలు చైతన్యం పెంచుకోవాలి. 

- వెంకటరమణయ్య, ఎంహెచవో, ఎనఎంసీ Updated Date - 2021-06-22T03:22:39+05:30 IST