నమ్మకంగా ఉండి లక్షలు దోచేశాడు

ABN , First Publish Date - 2021-10-30T05:00:17+05:30 IST

ఎన్నో ఏళ్లుగా ఆ కళాశాల యాజమాన్యానికి నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అధికార పార్టీ తరపున ప్రజా ప్రతినిధిగా గౌరవ స్థానంలో ఉన్నాడు. అయితే అత్యాస, ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. ఏకంగా రూ.70 లక్షలతో పరారయ్యాడు. ఆదిశంకర విద్యాసంస్థల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆ నిందితుడిని పోలీసులు శుక్రవారం ఇనుమడుగు సెంటర్‌లో అరెస్ట్‌ చేశారు.

నమ్మకంగా ఉండి లక్షలు దోచేశాడు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విజయరావు, చిత్రంలో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు

ఆదిశంకర కళాశాల అకౌంటెంట్‌ అరెస్ట్‌

సాంకేతికత ఆధారంగా గుర్తింపు

రూ.68.50 లక్షలు స్వాధీనం

నిందితుడు చెర్లోపళెం అధికార పార్టీ ఎంపీటీసీ

పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన వైసీపీ


నెల్లూరు(క్రైం) : అక్టోబరు 28:

ఎన్నో ఏళ్లుగా ఆ కళాశాల యాజమాన్యానికి నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అధికార పార్టీ తరపున ప్రజా ప్రతినిధిగా గౌరవ స్థానంలో ఉన్నాడు. అయితే అత్యాస, ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. ఏకంగా రూ.70 లక్షలతో  పరారయ్యాడు. ఆదిశంకర విద్యాసంస్థల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆ నిందితుడిని  పోలీసులు శుక్రవారం ఇనుమడుగు సెంటర్‌లో అరెస్ట్‌ చేశారు. నిందితుడి వివరాలను ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఉమేష్‌చంద్ర హాల్‌లో శుక్రవారం విలేకర్లకు వెల్లడించారు. 

కోవూరు మండలం చెర్లోపాళెం గ్రామానికి చెందిన గంగపట్నం శ్రీహరి నెల్లూరు లోని దర్గామిట్ట రెవెన్యూ కాలనీలో ఉన్న ఆదిశంకర కళాశాల గ్రూప్స్‌ కేంద్ర కార్యాలయంలో అకౌంటెంట్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాడు. గత నెల 22వ తేదీ సంస్థకు సంబంధించిన నగదు రూ.70 లక్షలు బ్యాంకులో జమచేసేందుకు బయలుదేరాడు. అయితే ఆ నగదును బ్యాంకులో జమచేయకుండా పరారయ్యాడు. శ్రీహరి చేసిన మోసం తెలుసుకున్న యాజమాన్యం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ విజయరావు ఆదేశాలతో నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీసీఎస్‌ డీఎస్పీ శివాజీరాజ పర్యవేక్షణలో క్రైంబ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌  దశరఽథరామారావు, ఎస్‌ఐ డీ విజయకుమార్‌, సీసీఎస్‌, దర్గామిట్ట స్టేషన్‌ సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తును ప్రారంభించారు. సాంకేతికత ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించి ఇనుమడుగు సెంటర్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.68.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు గంగాధర్‌, దశరఽథరామారావు, సీసీఎస్‌ ఏఎస్‌ఐ వెంకయ్య, హెడ్‌కానిస్టేబుళ్లు వారిస్‌ అహ్మద్‌, గంగిశెట్టి భాస్కర్‌, రామగిరి సురేష్‌కుమార్‌, జయరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నరేష్‌, సుబ్బారావు, అరుణ్‌కుమార్‌, మహబూబ్‌ బాషాలకు ఎస్పీ నగదు పురస్కారాలిచ్చి అభినందించారు. ఇదిలా ఉండగా నిందితుడు గంగపట్నం శ్రీహరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుతో ఎంపీటీసీగా గెలుపొందాడు. అయితే నగదుతో పరారైన వెంటనే శ్రీహరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు నాయకులు ప్రకటించారు.

Updated Date - 2021-10-30T05:00:17+05:30 IST