చేనేతలకు చెప్పింది కొండంత.. ఇస్తున్నది గోరంత !

ABN , First Publish Date - 2021-08-11T02:57:10+05:30 IST

జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు చేనేతలకు చేస్తానన్న ఆర్థిక సాయం కొండంత అని.. అధికారంలోకి వచ్చాక ఇస్తున్నది గోరంత

చేనేతలకు చెప్పింది కొండంత.. ఇస్తున్నది గోరంత !
చేనేతలతో ముఖాముఖి నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

 - కురుగొండ్ల  రామకృష్ణ

వెంకటగిరి, ఆగస్టు 10: జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు చేనేతలకు చేస్తానన్న ఆర్థిక సాయం కొండంత అని.. అధికారంలోకి వచ్చాక ఇస్తున్నది గోరంత అని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం పట్టణ పరిధిలోని బంగారుపేట చావిడివద్ద చేనేతలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఒక చీర తయారు చేయాలంటే మగ్గంపై నేసే కార్మికుడు ఒక్కడి వల్లే సాధ్యం కాదని, రాట్నంపై దారం ఒడికి, వాటికి రంగు వేయడం.. ఇలా అనేకమంది అనుబంధ కార్మికుల కష్టంతో చీర తయారవుతుం దన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌ మగ్గం ఉన్నవారికే నేతన్ననేస్తం వర్తింపచేయడంతో చేనేత అనుబంధ వృత్తులు చేసే కార్మికులకు మొండిచేయి చూపించడమేనన్నారు.  నేతన్న నేస్తం పథకాన్ని చేనేత అనుబంధరంగాల కార్మికులకు వర్తింప చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నేతన్నల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.  నేతన్నలకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని భరోసా యిచ్చారు.  నేతన్నలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా బంగారుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు ఉషా, పార్లమెంట్‌ యువత అధ్యక్షుడు రథి, స్థానిక నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

----------------

Updated Date - 2021-08-11T02:57:10+05:30 IST