వైసీపీ పాలనలో ముస్లింలకు అన్యాయం
ABN , First Publish Date - 2021-08-07T04:03:47+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగునా ముస్లింలకు అన్యాయం జరుగుతోందని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ నాయకులు పేర్కొన్నారు.
కావలి, ఆగస్టు 6: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగునా ముస్లింలకు అన్యాయం జరుగుతోందని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ నాయకులు పేర్కొన్నారు. ముస్లిం హక్కుల సాధనలో భాగంగా రాష్ట్ర ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి శుక్రవారం కావలికి చేరుకుంది. అనంతరం కావలి జర్నలిస్ట్‌క్లబ్‌లో ముస్లిం హక్కుల పోరాట కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింల రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేశారన్నారు. ఆ నమ్మకంతోనే ఆయన తనయుడైన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న పాలన వస్తుందని భావించి ముస్లింలందరు ఆయనకు ఓటు వేసి గెలిపించారన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో జరగని అన్యాయం ముస్లింలకు వైసీపీ ప్రభుత్వంలో జరగడం ఎంతో బాధాకరమని వాపోయాయు. భారత రాజ్యాంగంలో ముస్లింల హక్కులను కాలరాస్తున్న రాజకీయ పిశాచుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ముస్లిం సమాజాన్ని మేల్కొలపాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రమంతా పర్యటిస్తున్నామన్నారు. ఈ పర్యటనలో కమిటీలు వేసి ముస్లింలను చైతన్య పరచి అక్టోబరులో బస్సు యాత్రను చేపట్టి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటమే ఫెడరేషన్ అజండా అన్నారు. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావలి నియోజకవర్గ అధికార ప్రాతినిధిగా సయ్యద్ ముజీర్, కన్వీనర్‌గా సయ్యద్ తజ్ముల్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఎస్‌కే దస్తగిరి, అడ్వయిజర్ ఎస్‌కే మస్తాన్ వలీ, సమన్వయ కర్త కరిముల్లా, ఎండీ ఉస్మాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.