బొప్పాయిలో అంతర్‌ పంటల సాగు

ABN , First Publish Date - 2021-07-12T04:48:14+05:30 IST

బొప్పాయి సాగులో అంతర్‌ పంటగా బంతి మొక్కలు నాటడం వల్ల ఏవైనా పురుగులు ఆశించినా, ముందుగా బంతిపూలపైన వాలుతాయి.

బొప్పాయిలో అంతర్‌ పంటల సాగు
బొప్పాయి తోట

బంతి ఎంతో ఉపయోగం

పంటకు రక్షణ కవచం


నెల్లూరు (వ్యవసాయం), జూలై 11 : బొప్పాయి సాగులో అంతర్‌ పంటగా బంతి మొక్కలు నాటడం వల్ల ఏవైనా పురుగులు ఆశించినా, ముందుగా బంతిపూలపైన వాలుతాయి. దీంతో ప్రధాన పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదు. బంతి మొక్కలు బొప్పాయి పంటను రక్షణ కవచంగా ఉంటుందని ఉద్యానశాఖ సహయకులు కే ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. బొప్పాయి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన  రైతులకు తెలియజేశారు.


400 హెక్టార్లలో సాగు


జిల్లాలో సుమారు 400 హెక్టార్లలో బొప్పాయి సాగు జరుగుతోంది. అనంతసాగరం, ఆత్మకూరు, దుత్తలూరు, మర్రిపాడు, సైదాపురం, పొదలకూరు, బాలాయపల్లి తదితర మండలాల్లో బొప్పాయిని రైతులు సాగుచేస్తున్నారు. పొలంలో మొక్కలు నాటి అవి నిలదొక్కుకునే వరకు రోజు మార్చి రోజు నీరు అందించాలి. ఆ తరువాత వారానికి రెండు రోజులు నీరు అందిస్తే సరిపోతుంది. ఆకులు వాడిపోకుండా, బెట్టకు రాకుండా కాయ తయారయ్యే సమయంలో అవసరాన్ని బట్టి తోటకు సరిపడా నీరు అందించాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన 2నెలల తరువాత రసాయన ఎరువులు 20 :20 :0 : 13, 19:19:19, పొటాష్‌ కలిపిన 5కిలోల ఎరువును డ్రిప్‌ ద్వారా ఫెర్టిగేషన పద్ధతిలో అందించాలి. అదేవిధంగా పూతదశలో ఎరువులు మోతాడు సుమారు 15-20 కిలోల వరకు పెరుగుతుంది. పిందె కట్టు  దశ నుంచి కాయ దశకు చేరుకునే సమయంలో ఎరువుల  మోతాడు 25కిలోల వరకు పెరుగుతుంది. మొక్క నాటిన నుంచి పంట కాలం ముగిసిన 18నెలల కాలవ్యవధిలో 20 : 20 ! 0 : 13 8బస్తాలు, 19 : 19 :19 8బస్తాలు, అదేవిధంగా పొటాష్‌ 6బస్తాల చొప్పున డ్రిప్‌ ద్వారా ఫెర్టిగేషన పద్ధతిలో ఎరువులను అందించాలి. తోటలో దోమల నివారణకు ఎల్లోట్రాప్స్‌ అక్కడక్కడ కర్రలకు కట్టడం మంచిది.

Updated Date - 2021-07-12T04:48:14+05:30 IST