వైసీపీ మూక.. బరితెగించాక!

ABN , First Publish Date - 2021-10-20T05:20:13+05:30 IST

అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంపైనా దాడికి బరితెగించారు.

వైసీపీ మూక..  బరితెగించాక!
వైసీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

టీడీపీ కార్యాలయంపై దాడియత్నం

మూకుమ్మడిగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు

లోపలకు వెళ్లేందుకు విశ్వప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు

ఇరుపార్టీల నేతల మధ్య నినాదాల హోరు

రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు


నెల్లూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : 

అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంపైనా దాడికి బరితెగించారు. మంగళవారం సాయంత్రం వైసీపీ మూకలు ఒక్కసారిగా టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మూకలను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నాయకులంతా మినీబైపాస్‌ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. వైసీపీ నాయకుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయినా వారు ఎదురుతిరగడంతో అందరినీ బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న ఆ పార్టీ నేతలు బయటకొచ్చారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నినాదాలు చేయడంతో.. టీడీపీ నేతలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ నేతలను కార్యాలయంలోకి పంపే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలందరినీ అక్కడి నుంచి తరలించినా టీడీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలోనే పోలీసులు పహారా కాశారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించిన ఘటనలో 11 మందిపై బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వీరందరినీ స్టేషన బెయిల్‌పై విడుదల చేశారు. 


టీడీపీ నేతల ఆందోళన


టీడీపీ కార్యాలయంపైకి వైసీపీ నేతలు దాడికి యత్నించారన్న విషయం తెలుసుకున్న నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌తోపాటు పలువురు నేతలు హుటాహుటిన కార్యాలయం వద్దకు చేరుకుని, విచారించారు. వైసీపీ మూకల తీరుకు నిరసనగా అజీజ్‌, ఇతర నాయకులు రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. కొద్దిసేపు ప్రభుత్వం, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత అజీజ్‌ పోలీసులతో చర్చించారు. ఇటువంటి పరిస్థితులు దాపురించడం సిగ్గు చేటని, దాడికి యత్నించిన వారందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. అనంతరం అజీజ్‌ విలేకరులతో మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. తాము కూడా తలుచుకుంటే వైసీపీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేయగలుతామని హెచ్చరించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సహనం కోల్పోకుండా ప్రజల పక్షాన పోరాడుతున్నట్లు చెప్పారు.  సీఎం జగన్మోహనరెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తామున్నప్పుడు ధైర్యం ఉంటే మంత్రో, ఎమ్మెల్యేనో తమ కార్యాలయం వద్దకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. పోలీసులను అడ్డుపెట్టుకొని చేసే డ్రామాలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు. 


గూండా రాజ్యం రాజ్యమేలుతోంది


టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించారన్న విషయం తెలుసుకున్న నగర ఇనచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాత్రి అక్కడకు చేరుకున్నారు. ఆయన వచ్చాక కొద్దిసేపు నాయకులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గూండా రాజ్యం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. మొన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేశారని, నేడు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, దీని నుంచి ప్రజలను మరల్చడానికి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్‌కు తెరలేపిందని విమర్శించారు. టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే చెప్పి రావాలని కోటంరెడ్డి సవాల్‌ విసిరారు. మంత్రి అనిల్‌కుమార్‌ ఇంట్లో ఉండి టీడీపీ కార్యాలయంపైకి తన మనుషులను ఉసిగొల్పారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని భయపెట్టడం ఎవరితరం కాదని హెచ్చరించారు. కాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించడానికి నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు, రూరల్‌ తెలుగు యువత అధ్యక్షుడు అమృల్లాలు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. 


ఫ్యాక్షన రాజకీయాలకు పరాకాష్ట :  సోమిరెడ్డి


రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులు వైసీపీ ఫ్యాక్షన రాజకీయాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ధ్వజమెత్తారు. పట్టపగలు దాడులు చేస్తూ, ఆస్తులు విధ్వంసం జరుగుతుంటే రాష్ట్రం ఎక్కడికిపోతోందని ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ నేత మాట్లాడిన దానిలో అభ్యంతరముంటే కౌంటర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టుకోవడమో, లీగల్‌గా వెళ్లడమో చేయాలి గానీ దాడులు చేయడమేమిటని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, దుర్మార్గాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరల్లోనే ఉందన్నారు. 


వైసీపీ నేతల దాడి అనాగరిక చర్య : బీద


తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీ నేతలు దాడి చేయడం అనాగరిక చర్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో ఖండించారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు ఇంటిపై కూడా ఇలానే గత నెలలో దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా.. లేక తాలిబన్ల పాలనలో ఉన్నామా అన్న సందేహంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, విమర్శలు చేశారన్న కారణంతో దాడులకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని రవిచంద్ర ప్రశ్నించారు. 


గూడూరులో నిరసన


గూడూరు : మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై,  ఆ పార్టీ అధికారప్రతినిధి పట్టాభి నివాసంపై వైసీపీ మూకలు మంగళవారం దాడులకు దిగబడటం అమానుష చర్య అని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం గూడూరులోని గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ దాడులను ఖండిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్రజాస్వామికంగా దాడులకు దిగడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. 


కావలి : టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీమూకలు దాడి చేయడం అమానుషమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ మంగళవారం సాయంత్రం కావలి టీడీపీ డివిజన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్‌, కండ్లగుంట హదుబాబు నాయుడు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, కాకి ప్రసాద్‌, బొట్లగుంట శ్రీహరినాయుడు, కల్లయ్య, జ్యోతిబాబూరావు, మల్లిఖార్జునరెడ్డి, పల్లపు కుమార్‌, తటవర్తి వాసు తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-10-20T05:20:13+05:30 IST