అధికారులు చెబితేనే రుణాలు

ABN , First Publish Date - 2021-08-28T05:29:31+05:30 IST

పొదుపు సంఘాల సభ్యులు నకిలీ పత్రాలతో రుణాలు పొంది బ్యాంకులనే బురిడీ కొట్టించిన కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మెప్మా అధికారుల సిఫార్సుతోనే ఆయా సంఘాలకు రుణాలు ఇచ్చినట్లు బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో కారకులపై చర్యలు తీసుకోవడంలో మెప్మా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ పత్రాలతో రుణాలు పొందిన రెండు స్వయం సహాయక సంఘాల బాగోతాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవటంతో వివిధ బ్యాంకుల అధికారులు అప్రమత్తమయ్యారు.

అధికారులు చెబితేనే రుణాలు

బ్యాంకులకే బురిడీ కేసులో కదలిక

రెండు నెలల క్రితమే ఇండియన్‌ బ్యాంక్‌ లేఖ

సూత్రధారులపై పీడీకి వివరాలు

ఆంధ్రజ్యోతి కథనంతో మిగిలిన బ్యాంకులు అప్రమత్తం


నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 27 : పొదుపు సంఘాల సభ్యులు నకిలీ పత్రాలతో రుణాలు పొంది బ్యాంకులనే బురిడీ కొట్టించిన కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మెప్మా అధికారుల సిఫార్సుతోనే ఆయా సంఘాలకు రుణాలు ఇచ్చినట్లు బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో కారకులపై చర్యలు తీసుకోవడంలో మెప్మా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ పత్రాలతో రుణాలు పొందిన రెండు స్వయం సహాయక సంఘాల బాగోతాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవటంతో  వివిధ బ్యాంకుల అధికారులు అప్రమత్తమయ్యారు. 

నెల్లూరులోని జనార్దన్‌రెడ్డి కాలనీలో రీనా, స్వాతి అనే స్వయం సహాయక సంఘాలకు వెంకటేశ్వరపురంలోని కెనరా బ్యాంకులో సంబంధిత కమ్యూనిటీ ఆర్గనైజర్‌ ఓ ప్రసన్న  2020 డిసెంబరు 10న రూ. 9లక్షలను రుణంగా ఇప్పించినట్లు సమాచారం. అయితే ఆ సంఘాలు డబుల్‌ ఎంట్రీ ఆన్‌లైన్‌చేసి డూప్లికేట్‌ సభ్యులను సృష్టించి నారాయణరెడ్డిపేటలోని ఇండియన్‌ బ్యాంకులో రీనా ఎస్‌హెచ్‌జీ పేరుతో రూ. 7.20లక్షలు, స్వాతి ఎస్‌హెచ్‌జీ పేరుతో రూ.8లక్షలు రుణం పొందాయి. అంతటి తో ఆగకుండా నెల్లూరులోని ములుమూడి బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రీనా ఎస్‌హెచ్‌జీతో రూ.7లక్షలు, స్వాతి ఎస్‌హెచ్‌జీ తో రూ.7లక్ష లు రుణంగా పొందాయి. ఇక్కడ సీవో సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు సమాచారం. 


సీవో, సీఎంఎం చెబితేనే...

 రీనా, స్వాతి గ్రూపులకు రుణాలు మంజూరు చేయడానికి సంబంధించి నారాయణరెడ్డి పేటలోని ఇండియన్‌ బ్యాంకు అధికారులు ఈ ఏడాది జూన్‌ 25నే మెప్మా పీడీకి ఓ లేఖ పంపారు. మెప్మా సీవో సురేష్‌బాబు, సీఎంఎం (సిటీ మిషన్‌ మేనేజర్‌) కే కవిత తదితరులు రీనా, స్వాతి పొదుపు సంఘాలను పరిచయంచేస్తూ రుణాలు ఇవ్వాలని, ఆ గ్రూపులు నిజమైనవని పేర్కొనటంతో రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ రెండు గ్రూపులు బ్యాంకులను మోసం చేసి రూ.29 లక్షలను రుణంగా పొంది స్వాహా చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించడంతో మిగతా బ్యాంకులు కూడా అప్రమత్తమయ్యాయి. తమ వద్ద రుణాలు పొందిన పొదుపు గ్రూపులపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరికొన్ని నకిలీ ఎస్‌హెచ్‌జీలు, బ్యాంకు రుణాల విషయం బయటపడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మెప్మా అధికారులు ఇప్పటికైనా పొదుపు రుణాల విషయంలో మరింత పటిష్ట విధానాన్ని అవలంబించాలని మహిళలు కోరుతున్నారు.



Updated Date - 2021-08-28T05:29:31+05:30 IST