బాధితులెవరూ మరణించకూడదు!

ABN , First Publish Date - 2021-04-24T04:49:59+05:30 IST

జిల్లాలో కరోనాతో ఆసుపత్రికి వస్తే ఎవరూ మరణించకుండా వైద్యసేవలు అందించాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

బాధితులెవరూ మరణించకూడదు!
అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌

వైద్యసేవలను విస్తృతం చేయండి

బ్లాక్‌లో మందుల విక్రేతలపై కఠిన చర్యలు

అధిక ఫీజులు వసూలు చేసినా అంతే!

అధికారుల సమీక్షలో మంత్రి అనిల్‌ 


నెల్లూరు (వైద్యం)ఏప్రిల్‌ 23 : జిల్లాలో కరోనాతో ఆసుపత్రికి వస్తే ఎవరూ మరణించకుండా వైద్యసేవలు అందించాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం  జడ్పీ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, నోడల్‌ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమించేలా వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ప్రైవేట్‌ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలన్నారు. జీజీహెచ్‌, నారాయణ ఆసుపత్రులలో అదనపు ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూ పడకలు ఏర్పాటు చేశామన్నారు. బాధితులకు మందులు, పౌష్టికాహారం అందించడంతోపాటు ప్రతిరోజు రెండుపూటలా వారిని పరీక్షించి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు  24 గంటల్లో   వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి జేసీ హరేందిర ప్రసాద్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నమూనాల ఫలితాలు ఆదివారానికి అందేలా చూస్తానన్నారు. మంత్రి మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి పార్థివదేహాలనూ 24 గంటల్లో అందించాలని సూచించారు. జీజీహెచ్‌లో అదనంగా ఉన్న వెంటిలేటర్లను నారాయణ ఆసుపత్రితోపాటు ఇతర కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించాలన్నారు.  అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని 21 కొవిడ్‌ ఆసుపత్రులకు 21 మంది నోడల్‌ అధికారులను నియమించామని, కరోనా బాధితుల వివరాలు, డిశ్చార్జ్‌లు వంటి వివరాలు ప్రతిరోజు జేసీకి నివేదించాలని సూచించారు. రెమ్‌డెసివిర్‌ వంటి మందులు బ్లాక్‌మార్కెట్‌లో అమ్మిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 


అందుబాటులో ఆక్సిజన్‌, మందులు


కరోనా బాధితులకు ఆక్సిజన్‌, మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. జీజీహెచ్‌లో అవసరమైన రేడియాలజి్‌స్టలను నియమించుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.  ప్రైవేట్‌ ఆసుపత్రులలో అదనంగా ఉన్న వైద్యులను జీజీహెచ్‌లో రొటేషన్‌  పద్ధతిలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. 104, 1077 నెంబర్లకు ఫోన్‌ చేస్తే కరోనాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికి కరోనా టీకా వేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమీక్షలో జేసీలు ప్రభాకర్‌రెడ్డి, బాపిరెడ్డి, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినే్‌షకుమార్‌, అదనపు ఎస్పీ వెంకటరత్నం, గూడూరు సబ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, డీపీవో ధనలక్ష్మి, ఆరోగ్య శాఖ, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:49:59+05:30 IST