అయ్యా.. మేం బతికే ఉన్నాం!

ABN , First Publish Date - 2021-05-31T04:49:19+05:30 IST

‘‘అయ్యా మేమంతా బతికే ఉన్నాం. మీకు కనిపిస్తున్నాం కదా!? మరి మా ఆధార్‌ కార్డు నెంబర్‌ ఆనలైనలో నమోదు చేస్తే చనిపోయినట్టు వస్తోంది.

అయ్యా.. మేం బతికే ఉన్నాం!
కుమారుడు గిరీష్‌తో ఆవేదన చెందుతున్న తల్లి రమణమ్మ

చనిపోయినట్టు ఆనలైనలో నమోదు

నవరత్నాలకు నోచుకోని గిరిజనులు

వలంటీర్ల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం


సైదాపురం, మే 30 : ‘‘అయ్యా మేమంతా బతికే ఉన్నాం. మీకు కనిపిస్తున్నాం కదా!? మరి మా ఆధార్‌ కార్డు నెంబర్‌ ఆనలైనలో నమోదు చేస్తే చనిపోయినట్టు వస్తోంది. ఇది ఎలా సాధ్యం!? మాకు న్యాయం చేయండి.’’ అంటూ గిరిజనులు మొరపెట్టుకుంటున్నారు. సైదాపురం మండలం పోతేగుంట గ్రామంలోని గిరిజనకాలనీవాసులు వలంటీర్ల నిర్వాకంతో నవరత్నాలు పథకాలకు దూరం అవుతున్నారు. బతికి ఉండగానే ఆనలైనలో చనిపోయినట్టు చూపుతుండటంతో ఏంచేయాలో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. కాలనీకి చెందిన రమ్మణమ్మ  పదో తరగతి చదువుతున్న తన కుమారుడు చిట్టేటి గిరీష్‌ పేరును రేషన్‌ కార్డులో చేర్పించేందుకు 4 నెలలుగా సచివాలయం చూట్టూ తిరుగుతోంది. గిరీష్‌ పేరు కార్డులో చేర్చేందుకు వీల్లేదని, ఆధార్‌ నెంబర్‌ ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేస్తే మృతి చెందినట్లు వస్తోందని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. కళ్లెదుటే తన బిడ్డ ఉంటే చనిపోడం ఏమిటని ఆమె సిబ్బందిని నిలదీసింది. అలాగే అదే కాలనీకి చెందిన 69 ఏళ్ల యల్లంపల్లి పెంచలమ్మ భర్త చింతాలయ్య సంవత్సర క్రితం చనిపోయాడు. పింఛను కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకుంది.  అడిగినపుడల్లా నీకు పింఛన్‌ వస్తుందిలే అని వలంటీరు సమాధానం దాట వేశారు. సచివాలయ సిబ్బందిని అడిగితే  పెంచలమ్మ మృతి చెందినట్లు  ఆన్‌లైన్‌లో నమోదై ఉంది.  మరో 62 ఏళ్ల వృద్ధుడు వృద్దుడు గడ్డం కిష్టయ్య కూడా చనిపోయినట్టు ఆనలైనలో కనిపిస్తోంది. దీంతో ఆయన పింఛనుకు నోచుకోలేదు. వలంటీర్ల నిర్వాకంతో తాము ప్రభుత్వ పథకాలకు  దూరమవుతున్నట్టు గిరిజనులు వాపోతున్నారు. ఈ విషయమై ఎమ్పీడీవో వాణిరెడ్డిని విరవణ కోరగా  బతికి ఉండగానే చనిపోయి ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. 

Updated Date - 2021-05-31T04:49:19+05:30 IST