ఏపీఆర్‌ఎస్‌ఏలో ఎన్నికల నగారా

ABN , First Publish Date - 2021-12-19T05:33:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసి యేషన్‌(ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా శాఖ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఏపీఆర్‌ఎస్‌ఏలో ఎన్నికల నగారా
రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయం

నోటిఫికేషన్‌ విడుదల

2న పోలింగ్‌.. అదేరోజు ఫలితాలు

ఏకగ్రీవానికి యత్నం


నెల్లూరు(హరనాథపుచం), డిసెంబరు 18 : ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసి యేషన్‌(ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా శాఖ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జనవరి 2వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా అధ్యక్షుడు, అసోసియేట్‌ అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి, ఒక ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, ఒక స్పోర్టు-కల్చరల్‌ కార్యదర్శి, నలుగురు సంయుక్త కార్యదర్శులు, ఒక ట్రెజరర్‌, ఏడుగురు కార్యనిర్వాహక సభ్యుల పోస్టులకు సంబంధించి ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 21న తుది ఓటర్ల జాబితాను కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఏపీఆర్‌ఎస్‌ఏ కార్యాలయంలో ప్రకటిస్తారు.  ఎన్‌ శ్రీనివాస్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. జనవరి 2వ తేదీ సాయంత్రానికల్లా ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు.


డివిజన్ల ఎన్నికలు ఏకగ్రీవం

రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం 1964లో ఏపీఆర్‌ఎస్‌ఏ ఏర్పాటైంది. నాటి నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్య నారాయణ సింగ్‌, కార్యదర్శిగా అల్లంపాటి పెంచలరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే అల్లంపాటి పెంచలరెడ్డిని ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. దీంతో జిల్లాలో ఆయన స్థానం ఖాళీ అయింది. కాగా, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా ఎన్నికలు నిర్వహించే ముందు జిల్లాలోని నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు కావలి డివిజన్లకు,  కలెక్టరేట్‌ యూనిట్‌కు ఎన్నికలు నిర్వహించారు. అక్టోబరు నుంచి ఈ నెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అన్నిచోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కావడం విశేషం. 1983వ సంవత్సరం తరువాత యూనిట్‌ ఎన్నికలన్నీ ఏకగ్రీవం కావటం ఇదే ప్రథమమని సమచారం. ఆ ఎన్నికలు పూర్తయినందున తాజాగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.  అయితే, యూనిట్‌ ఎన్నికల్లాగే జిల్లా ఎన్నికలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


పటిష్టమైన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి

జిల్లా శాఖ ఎన్నికల్లో డివిజన్‌ కార్యవర్గ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొని పటిష్టమైన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. ఇప్పటికే అన్ని డివిజన్లు, కలెక్టరేట్‌ యూనిట్‌ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా చూశాం. జిల్లా కార్యవర్గం కూడా ఏకగ్రీవం అయ్యేలా కృషి చేస్తాం. 

- అల్లంపాటి పెంచలరెడ్డి, ఏపీఆర్‌ఏ రాష్ట్ర కార్యదర్శి 

Updated Date - 2021-12-19T05:33:42+05:30 IST