పెన్నా తీరం.. కళేబరాల మయం !

ABN , First Publish Date - 2021-02-08T07:25:25+05:30 IST

జిల్లాకు జీవనాడి అయిన పవిత్ర పినాకినీ(పెన్నా) నదీ తీరం జంతు కళేబరాల గుట్టలతో నిండిపోతోంది.

పెన్నా తీరం..  కళేబరాల మయం !
పెన్నా నదిలో కళేబరాలు

బోడిగాడితోట వద్ద భారీగా గేదెల అవశేషాలు

మాంసం మాఫియా పనిగా అంచనా


నెల్లూరు (సిటీ), ఫిబ్రవరి 7 : జిల్లాకు జీవనాడి అయిన పవిత్ర పినాకినీ(పెన్నా) నదీ తీరం జంతు కళేబరాల గుట్టలతో నిండిపోతోంది. ఇప్పటి వరకు చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ కవర్లు వంటి వ్యర్థాలు మాత్రమే పెన్నాలో పోగవుతుండగా తాజాగా భారీస్థాయిలో గేదెల అవయవాల అవశేషాలు పేరుకుంటున్నాయి. బోడిగాడితోట వద్ద నదిలో వీటిని ఆదివారం మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. కొన్నింటిని ఇసుకలో పూడ్చేయగా మరికొన్నింటిని ముళ్ల పొదల్లో పడేసి ఉన్నారు. ఇలా వందల గేదెల అవశేషాలను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇదంతా నెల్లూరు కేంద్రంగా సాగుతున్న మాంసం మాఫియా పనిగా అంచనా వేస్తున్నారు. గేదెల మాంసాన్ని మటన్‌ దుకాణాలకు తరలించే మాఫియాను గతంలో కార్పొరేషన్‌ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో టన్నుల కొద్దీ మాంసాన్ని నిల్వ చేసిన గోదాములకు దగ్గర్లోనే ఇప్పుడు కళేబరాలు బయటపడ్డాయి. దీంతో మాంసం మాఫియా మళ్లీ జడలు విప్పినట్లు కనిపిస్తోంది. దీనిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.



Updated Date - 2021-02-08T07:25:25+05:30 IST