అంగన్‌వాడీల్లో భయం.. భయం!

ABN , First Publish Date - 2021-05-03T04:41:22+05:30 IST

సంగం మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తకు కరోనా పాజిటివ్‌ నమోదైంది.

అంగన్‌వాడీల్లో భయం.. భయం!
సంగం మండలంలో ఓ అంగన్‌వాడీ కేంద్రం

చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన

కరోనాతో పంపేందుకు వెనుకడుగు

సెలవులు ప్రకటించాలని వినతులు 


సంగం, మే 2: సంగం మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తకు కరోనా పాజిటివ్‌ నమోదైంది. అనుమానంతో కేంద్రంలోని చిన్నారులకు పరీక్ష చేయించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మిగిలిన చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై పిల్లలను కేంద్రానికి పంపలేదు. ఇది ఒక్క సంగం మండలంలోనే కాదు.. జిల్లా అంతటా నెలకొంది. జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్‌ 20 నుంచి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు పది విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలున్నా మే 1 నుంచి 31 వరకు సెలవులు ప్రకటించింది. కానీ అంతకన్నా చిన్న పిల్లలు చదివే అంగన్‌వాడీ కేంద్రాల గురించి మాత్రం ఆలోచించలేదు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. 


తగ్గిన హాజరుశాతం

జిల్లాలో 17 అంగన్‌వాడీ ప్రాజెక్టులు ఉండగా, 3774 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అర్బన్‌లో 218, గ్రామీణ ప్రాంతాల్లో 3556 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 3774 మంది కార్యకర్తలు, ఆయాలు పని చేస్తున్నారు. కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులే ఉంటుండంతో మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్ల గురించి ఆలోచించే పరిపక్వత వారికి ఉండదు. దీంతో కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు చేయడం సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. ఇక మాస్కులు, శానిటైజర్లు ప్రభుత్వం సరఫరా చేయదు.   ఇప్పటికే కరోనా భయంతో కేంద్రాలకు చిన్నారులను పంపడం లేదు. కార్యకర్తలు చిన్నారులను కేంద్రాలకు తీసుకురాలేక మదనపడుతున్నారు. దీంతో కేంద్రాలు భయాందోళన నడు మ మొక్కుబడిగా జరుగుతున్నాయి. అధికారులు స్పందించి అంగన్‌వాడీలకు కూడా సెలవులు ప్రకటించాలని సిబ్బందితో పాటు చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


భౌతికదూరం పాటిస్తున్నాం 

అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు రాలేదు. కొవిడ్‌ కారణంగా పిల్లలను కేంద్రాలకు తల్లిదండ్రులు పంపడం లేదు. ఆయాలు చిన్నారులను తీసుకురావడానికి భయపడుతున్నారు. దీంతో హాజరు బాగా తగ్గిపోయింది. వచ్చిన పిల్లలకు మాస్కులు ధరిం చి భౌతిక దూరం పాటించేలా కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

         - శారద, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌

 

Updated Date - 2021-05-03T04:41:22+05:30 IST